'రాహుల్‌ది ఐరన్‌ లెగ్‌.. కేటీఆర్‌ది గోల్డెన్‌ లెగ్‌'

15 Mar, 2017 22:18 IST|Sakshi
'రాహుల్‌ది ఐరన్‌ లెగ్‌.. కేటీఆర్‌ది గోల్డెన్‌ లెగ్‌'

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీది ఐరన్‌ లెగ్‌ అని, మంత్రి కేటీఆర్‌ది గోల్డెన్‌ లెగ్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌కు రాహుల్‌ను విమర్శించే స్థాయి లేదని ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాహుల్‌ ఎక్కడ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్‌ ఎందుకు పార్టీ మటాష్‌ అవుతోంది..? ఉత్తర ప్రదేశ్‌లో మంచి ఊపుమీదున్న సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్‌  మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని  కర్నె మండిపడ్డారు. 

బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు.  తెలంగాణ వస్తుందో, రాదో కూడా తెలియని స్థితిలో ఉద్యోగం వదులుకుని ఉద్యమంలోకి వచ్చాడని  పేర్కొన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలంతా తెలంగాణ వైపు చూసేలా మూడు లక్షల ఉద్యోగాలు తీసుకురావాలని కేటీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.  ఆలాంటి వ్యక్తిని పట్టుకుని దోచుకోవడానికే అమెరికా నుంచి వచ్చాడని అనడం ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.  

ఉద్యమ సమయంలో మంత్రి పదవి కోసం ఆంధ్రా పాలకుల వద్ద ఊడిగం చేసిన చరిత్ర ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిది కాదా అని ప్రశ్నించారు. ఇళ్ల పేరుతో దోచుకుతిన్న ఆయన అవినీతికి సూర్యాపేట వద్ద కారులో కాలిపోయిన నోట్ల కట్టలే నిదర్శనం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి ఎంత అనుభవం ఉందో మంత్రి కేటీఆర్‌కు అంతే అనుభవం ఉందన్నారు. దేశాన్ని రక్షించే సైనికుడిగా పనిచేశానని చెప్పుకునే ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని నష్టపరిచే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు