ఇంత భారీ మెజార్టీ ఎవరికీ రాలేదు

19 May, 2016 13:10 IST|Sakshi
ఇంత భారీ మెజార్టీ ఎవరికీ రాలేదు

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో నియోజకవర్గ రికార్డు మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చీఫ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. విజేత నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.

'పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఇంతకుముందు 1972లో కాంతయ్య 25452 మెజారిటీతో గెలిచారు. ఇంతకుమించి ఎవరికీ మెజారిటీ రాలేదు. తుమ్మల 45వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు నిరంతరంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. గెలిచినంత మాత్రాన ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదు. సంస్కారం ఉండాలి, మరింత అంకిత భావంతో పనిచేయాలి. ప్రతిపక్షాలకు కూడా ఒకమాట చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన ఐదో రోజు నుంచి టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలు, అసత్యాలతో పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. రొడ్డకొట్టుడు మాదిరిగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ అంటే కమీషన్ కాకతీయ అన్నారు. మీకు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా. దాడి చేయడమే రాజకీయం అనేది సరికాదని ప్రజలు పలుమార్లు చెబుతున్నారు. వ్యక్తిగత దాడి, విమర్శలు, నిందలు ఇకనైనా మానుకోవాలి' అని కేసీఆర్ అన్నారు.

మరిన్ని వార్తలు