కేసీఆర్ మావాళ్లను కొంటున్నారు

15 Jun, 2016 19:43 IST|Sakshi
కేసీఆర్ మావాళ్లను కొంటున్నారు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కాంట్రాక్టులు పొందేందుకు, స్వప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని కలసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని కోరుతామని చెప్పారు. బుధవారం జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు.

కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని రెండు, మూడు రెట్లు పెంచి అవినీతికి తలుపులు తెరిచారని దిగ్విజయ్ ఆరోపించారు. ప్రాజెక్టులలో అవినీతిపై వచ్చేవారం కాంగ్రెస్ పార్టీ ప్రజెంటేషన్ ఇస్తుందని తెలిపారు. మల్లన్నసాగర్ సహా అన్ని ప్రాజెక్టుల భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు: కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఆరోపించారు. బంగారు తెలంగాణ ముసుగులో విపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆశించినట్టుగా తెలంగాణలో పాలన జరగడం లేదని జానారెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు