ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి

4 May, 2016 03:20 IST|Sakshi
ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి

సీఎం కేసీఆర్‌కు విపక్షాలు, రైతు సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీటిని ఎలా అందిస్తారో శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ (రాయల), వివిధ రైతు సంఘాలు డిమాండ్ చేశా యి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని గతంలో డిమాండ్ చేసిన టీఆర్‌ఎస్... ఇప్పుడు దానిని విస్మరించి, ప్రాజెక్టుల రీడిజైన్ అంటూ కొత్త ప్రణాళికలు రూపొందించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించాయి.

మంగళవారం మఖ్దూంభవన్‌లో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. చాడ వెంకటరెడ్డి(సీపీఐ), జంగారెడ్డి(సీపీఎం), దాసోజు శ్రవణ్(కాంగ్రెస్), వంటేరు ప్రతాప్‌రెడ్డి(టీడీపీ), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), పీఎల్ విశ్వేశ్వరరావు(ఆప్), నైనాల గోవర్దన్ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు, జల సంఘం అనుమతులు లేకుండానే శంకుస్థాపనలు చే యడం చట్టవిరుద్ధమని నేతలంతా అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2వేల కోట్లు కేటాయిస్తే 8 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే 2లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నా రు.

కానీ వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. తడికపల్లి, పాములపర్తి వంటి వాటిని లిఫ్ట్‌లతో చేపట్టడమేమిటని నిలదీశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటి ఉపయోగాలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సమాచారంతో ఒక మెమొరాండం రూపొందించి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, జల సంఘానికి సమర్పించాలని... ఆ నివేదికపై ప్రభుత్వం స్పందించే తీరుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని, ఈ నెల 8న మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు