చండీయాగం ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్

21 Dec, 2015 19:35 IST|Sakshi
చండీయాగం ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్

హైదరాబాద్: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న యాగం ఏర్పాట్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. చండీ యాగాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు వసతి భోజనం, విశ్రాంతి, వీక్షణం వంటి ఏర్పాట్లు చేశారు. యాగ ప్రాంగణంలో 2వేల మంది ఒకేసారి కుంకుమార్చన చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు, అర్చన సామాగ్రి ఉచితంగా అందించాలని ఆయన నిర్ణయించారు. ఆయుత మహ చండీ యాగానికి వచ్చే భక్తులు, బ్రాహ్మణులు, మహిళలు, అధికారులు, పురోహితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడిక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

కుంకుమార్చన నిర్వహణకు ప్రత్యేక పురోహితులతో పాటు మహిళా బ్రాహ్మణ వలంటీర్లను కూడా నియమిస్తున్నట్టు సీఎం చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల నుండి భక్తులు నేరుగా యాగ శాలకు వెళ్లి యాగ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. యాగం జరుగుతుండగా యాగ శాల నలువైపులా మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు కూడా యాగశాలకు ఇరువైపులా దాదపు 4 వేల మంది ఒకేసారి కూర్చోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి చండీయాగం వలంటీర్లకు సూచించారు. శృంగేరి నుండి వచ్చే రుత్విజుల కోసం తెలంగాణలో బ్రహ్మణుల కోసం, ప్రముఖుల కోసం, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి శాలలను సీఎం పరిశీలించారు.  భక్తులకు అవసరమైన సమాచారం అందించడానికి సమాచార కేంద్రం, తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.

మరిన్ని వార్తలు