సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు

24 May, 2016 02:32 IST|Sakshi
సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు

ఐదెకరాల్లోపు ఉంటే ఉచితంగానే.. జూన్ 2 నుంచి 10 వరకు అవకాశం
రికార్డులు సరిచేయండి: జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్


► దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో మ్యుటేషన్ పూర్తి కావాలి
► అధికారులు అవినీతికి పాల్పడినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు
► భూ వ్యవహారాలకు కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారి..
► జూన్ 30లోగా అసైన్డ్ భూముల వివరాలను సేకరించండి
► ప్రతి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరపాలి
► ఒక్కో జిల్లాకు రూ.30 లక్షలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలన్నీ పరిష్కరించి భూమి రికార్డులను సరిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సాదా బైనామాల(తెల్ల కాగితంపై చేసుకునే భూక్రయవిక్రయాలు)పై గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన భూముల లావాదేవీలన్నింటినీ జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు రిజిస్టర్ చేయాలని సూచించారు. 2014 జూన్ 2 నాటికి సాదా బైనామాలపై ఉన్న ఐదెకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్టర్ చేసి, పేరు మార్పిడి(మ్యుటేషన్) చేయాలని చెప్పారు. ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించాలని ఆదేశించారు. సోమవారమిక్కడ ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, వివిధ శాఖల సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూవివాదాల పరిష్కారానికి సంబంధించి సీఎం పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ‘‘హెచ్‌ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా), ఇతర మున్సిపల్ ప్రాంతాలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరగాలి. భూముల వ్యవహారంలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’’ అని సీఎం ఆదేశించారు. వారసత్వంగా సంక్రమించిన భూములకు సంబంధించి మ్యుటేషన్ చేసేందుకు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇకపై పేరు మార్పిడి (పౌతి)కి దరఖాస్తు వచ్చిన పది రోజుల్లోగా పని పూర్తి కావాలని, 11వ రోజున కలెక్టరేట్‌కు వివరాలు పంపాలన్నారు. భూవిక్రయం జరిగి రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో పేరు మార్పిడి జరగాలని, 16వ రోజు వివరాలు కలెక్టరేట్‌కు అప్‌లోడ్ చేయాలని స్పష్టంచేశారు. ఈ వ్యవహారాలు చూసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. నాలా పన్ను దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. మీ సేవా కేంద్రాల్లోనే పన్ను కట్టి, దరఖాస్తు చేసుకుంటే ఈ పని జరగాలని పేర్కొన్నారు. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎక్కువగా వాయిదాలు వేయకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు.
 
అసైన్డ్ భూముల వినియోగంపై ఆరా
రాష్ట్రంలో అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని సీఎం అభిప్రాయపడ్డారు. వాటిని తిరిగి నిరుపేదలకు అప్పగించాలని, లేదా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అసైన్డ్ భూముల వివరాలను జూన్ 30లోగా సేకరించాలని ఆదేశించారు. ‘‘అసైన్‌దారులే భూమిని సాగుచేసుకుంటే(కాస్తు) ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వ్యవసాయం చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తాం. లేకుంతే తిరిగి పేదలకు పంపిణీ చేద్దాం..’’ అని సీఎం చెప్పారు.
 
ఘనంగా అవతరణ దినోత్సవం
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకావిష్కరణ చేయాలి. అన్ని కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ప్రజలకు స్వీట్లు పంచాలి. అనాథ శరణాలయాలు, అంధ పాఠశాలలు, ఆసుపత్రుల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతోపాటు మాంసాహారం అందించాలి. ఉపాధి హామీ కూలీలకు పండ్లు, స్వీట్లు ఇవ్వాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గొప్పగా గౌరవించాలి. హోటల్స్, మాల్స్, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో ఉత్సవ వాతావరణం కనిపించాలి.

గుడులు, మసీదులు, చర్చిల్లో తెలంగాణ ప్రజల సంక్షేమానికి, వానల కోసం ప్రత్యేక పూజలు చేయాలి. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఉత్సవం నిర్వహించాలి. కవి సమ్మేళనాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున ఉత్సవాల నిర్వహణకు నిధులు ఇస్తున్నాం. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన ఉత్సవానికి ప్రతి జిల్లా నుంచి 50 మంది ప్రముఖులను పంపాలి. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందించాలి...’’ అని సీఎం కలెక్టర్లకు సూచించారు.
 
ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు
ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాల్లో అవినీతిని నిరోధించాలని, కల్యాణలక్ష్మితో పాటు ఇతర కార్యక్రమాల్లో లబ్ధిదారులకు అందించే సాయాన్ని చెక్కు రూపంలో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. కల్యాణలక్ష్మి చెక్కులను ఆడపిల్ల తల్లికి అందించాలని, పెళ్లికి ముందే ఈ సాయం అందించాలన్నారు.
 
డబుల్ బెడ్రూం ఇళ్లకు స్థానికంగా టెండర్లు
‘‘డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎక్కడికక్కడే టెండర్లు పిలవాలి. స్థానికులతో కట్టించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇసుకను ఉచితంగా అందించాలి..’’ అని సీఎం చెప్పారు. కృష్ణా పుష్కరాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్లేస్‌లు, అప్రోచ్ రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని, నదిలో పడవలు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. జోగులాంబ దేవాలయం దగ్గర ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పదో తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు ఎలాంటి పరిమితి లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్లో చేర్పించాలని ఆదేశించారు.
 
పత్తికి ప్రత్నామ్నాయాన్ని ప్రోత్సహించండి

‘‘వాతావరణం చల్లబడినా ఎండా కాలం అయిపోలేదు. తాగునీటి సరఫరాతో పాటు ఇతర కార్యక్రమాలన్నీ కొనసాగించాలి. వచ్చే ఖరీఫ్‌కు ఇప్పట్నుంచే సిద్ధం కావాలి. పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులను ప్రోత్సహించాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు. ‘‘సోయాబీన్ విత్తనాలను ఎక్కువ మొత్తంలో  అందుబాటులో ఉంచాలి. డిమాండ్ మేరకు ఇతర విత్తనాలు, అవసరమైనంత డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాలి. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణం వ్యవసాయ క్షేత్రాల్లో వేగంగా పూర్తి చేయాలి..’’ అని పేర్కొన్నారు.

 

>
మరిన్ని వార్తలు