మోదీకి భయపడుతున్న కేసీఆర్‌

27 May, 2017 00:59 IST|Sakshi
మోదీకి భయపడుతున్న కేసీఆర్‌

► కేంద్ర మాజీ మంత్రి సర్వే
►  కేంద్ర నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి: సబిత


సాక్షి, హైదరాబాద్‌:టీఆర్‌ఎస్, బీజేపీలపై టీపీసీసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని ఆరోపించారు.శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వంశీ చంద్‌రెడ్డి, టీపీసీసీ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి వేర్వేరుగా విలేకరులతో మా ట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులవల్లే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ భయపడిపోతున్నారని సర్వే అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన తెలంగాణలో తుస్సుమన్నదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు చీమూ నెత్తురుంటే అమిత్‌ షాను తిట్టిన కేసీఆర్‌ను ప్రతిఘటించాలన్నారు. బీజేపీపై కేసీఆర్‌ చేసిన విమర్శలు నిజమే అయితే, ఈడీ, సీబీఐ కేసుల భయమే కేసీఆర్‌కు లేకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ఉంటారా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజన, బయ్యారం ఉక్కు ఫాక్టరీ, వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటివాటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. టీఆర్‌ఎస్‌ని చీల్చుతారనే భయంతోనే మోదీ ని కేసీఆర్‌ నిలదీయడంలేదని అన్నారు.

కేంద్రం లక్ష కోట్లు ఇచ్చామని చెబుతుంటే, కేసీఆర్‌ ఇవ్వలేదంటున్నారని,వాస్తవాలేమిటో ప్రజల ముందుంచడానికి శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్‌ చేశారు. ఆదాయంలో రాష్ట్రం నంబర్‌ వన్‌ అంటున్న సీఎం ఎందుకు అప్పులు చేస్తున్నారో, ఆదా యాన్ని ఏంచేస్తున్నారో చెప్పాలన్నారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్పు చేసి జాతీయహోదా రాకుండా కేసీఆర్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి బలమే లేదని, రాష్ట్రంలో ఎప్పుడూ జీరోయేనని వ్యాఖ్యానించారు.

నిధుల మళ్లింపు ఆర్థికనేరమే...
ప్రజల సొమ్మును వాడుకోవడం, నిధులను మళ్లించడం ద్వారా సీఎం కేసీఆర్‌ ఆర్థిక నేరానికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై అమిత్‌షా, కేసీఆర్‌ తలోమాట మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి, ఎన్ని నిధులను ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం వాటిని దేనికోసం ఖర్చు చేసిందో వివరించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు