యాగవల్లి

24 Dec, 2015 00:17 IST|Sakshi
యాగవల్లి

వేద మంత్రాలతో ఘోషించిన ఎర్రవల్లి
వైభవంగా ప్రారంభమైన అయుత చండీ యాగం
అమ్మవారి సేవలో తరించిన భక్తజనం

 
అయుత చండీ మహాయాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం ఈ మహా క్రతువు మొదలైంది. సకల వసతులతో కూడిన ఏర్పాట్లు అందరిని కట్టిపడేశాయి. లోక కల్యాణం కోసం సీఎం కేసీఆర్ దంపతులు చేపట్టిన ఈ యాగంలో వందలాదిమంది వేద పండితులు ఒక్కచోట చేరి వేదాలు ఘోషించారు. గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం పెద్ద సంఖ్యలో అమ్మవారి పూజలో పాల్గొన్నారు. మహిళలు భారీ ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. చండీ మాత పూజతోపాటు యాగ నిర్వహణను అతిథులు, భక్తులు చూసి తరించారు. దాదాపు 50 వేల మందికి రుచికరమైన భోజనాలను వడ్డించారు. ఐదురోజుల మహోత్సవంలో మొదటిరోజు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి.    - జగదేవ్‌పూర్
 
ఐదువేల మందితో కుంకుమార్చన..
గజ్వేల్: చండీయాగం విజయవంతం చేసేందుకు యాగ శాల ప్రధాన ద్వారం సమీపంలో పెద్ద ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. ఐదు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో ఒక్కోవిడతలో వెయ్యిమంది చొప్పున మహిళలు పాల్గొన్నారు. ఒక్కో విడత 45నిమిషాలపాటు సాగింది. 40 మంది వేద పండితులు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అమ్మవారికి వెయ్యి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు.
 
అయుత సంకల్పానికి దగ్గరి మార్గం..

 సంగారెడ్డిలోని దుర్గాభవానీ క్షేత్రం నిర్వాహకులు కాసుల నర్సింహశర్మ, పవనశర్మ  కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అయుత సంకల్పానికి ఇది చాలా దగ్గరి మార్గంగా అభివర్ణించారు. వెయ్యి సహస్ర నామాలుగా సాగే ఈ కార్యక్రమంలో ఒక్కో నామానికి ఒక్కో విశేషం ఉంటుందని చెప్పారు. కుంకుమార్చనలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొని మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఏర్పాట్లను అదనపు జేసీ వెంకట్వేర్లు, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పర్యవేక్షించారు.
 
50వేల మందికి భోజనాలు

జగదేవ్‌పూర్: అయుత చండీయాగానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణతోపాటు భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజన కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం భక్తులకు ఉప్మా, చెట్నీతో అల్పాహారమందించారు. మధ్యాహ్న భోజనంలో కందిపప్పు, ఆలుగడ్డ, కాలీఫ్లవర్‌తో కలిపి కూరలు చేశారు. బెండకాయతో పిండిచారు, పెరుగు, దొండకాయ పచ్చడితో భోజనం పెట్టారు. మధ్యాహ్నం 1:40 నుంచి భోజనాలు మొదలు పెట్టగా సాయంత్రం వరకు కొనసాగింది. 50 వేల మంది భోజనాలు చేసినట్టు అంచనా.
 
లోక కల్యాణం కోసమే...
శాంతి కోసం, లోక కల్యాణం కోసం చేస్తున్న యాగమిది. ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించడం. కరువు కాటకాలను తరిమికొట్టడం, పశుపక్షాదుల సంరక్షణ తదితర లక్ష్యాలు సైతం ఇందులో ఇమిడి ఉన్నాయి. నేను శృంగేరిలో, ప్రస్తుతం ఇక్కడ రెండసార్లు అయుత చండీయాగంలో పాల్గొన్నా. ఎంతో ఆనందంగా ఉంది.
 - ఆదిత్య శర్మ (వేద పండితులు, శివమొగ్గ, కర్ణాటక)
 
యాగంతో మంచి ఫలితాలు
నియమ నిష్టలతో చేృస్తున్న ఈ యాగంతో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కళ్లల్లో ఆనందం చూసేలా.. కరువును తరిమికొట్టాలని దేవతలను వేడుకునే క్రమంలో యాగం జరపడం సంతోషకరం. గతంలో శృంగేరి పీఠంలో... ప్రస్తుతం అయుత చండీ యాగాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.
 - శ్రీపాద శర్మ(హోస్‌పేట్, కర్ణాటక)
 
ఏర్పాట్లు ఘనం...
గతంలో మా  క్షేత్రంలోనూ ఈ యాగం జరిగింది. వైదిక నిర్వహణలో మార్పుల్లేవు. కానీ ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. యాగశాలలు, వసతుల ఏర్పాట్లు పూర్తిగా ఆధ్మాత్మిక వాతావరణంలో సాగాయి. ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం మరెవరికీ సాధ్యం కాదు.
 - కాసుల నర్సింహ్మశర్మ (సంగారెడ్డిలోని
 దుర్గాభవానీ క్షేత్రం నిర్వాహకుల్లో ఒకరు)
 
అంతా ఆధ్యాత్మికత...
యాగశాల ప్రాంగణంలో అణువణువునా.... ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దృఢ సంకల్పంతో సీఎం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు యాగశాలను సందర్శించి చండీమాత అనుగ్రహానికి పాత్రులు కావాలి. నిజంగా ఇది మంచి అవకాశం.
 - పవన కుమార శర్మ
 (సంగారెడ్డి భవానీ క్షేత్రం నిర్వాహకుల్లో ఒకరు)
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా