-

నేతన్నలకు బీమా కొనసాగించండి

27 Apr, 2018 00:22 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్‌

ఢిల్లీలో రాష్ట్రాల జౌళి శాఖ మంత్రుల సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నేతన్నలకు ఆరోగ్య బీమా, జీవిత బీమా పథకాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కె.తారకరామారావు కోరారు. ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో కేటీఆర్‌ సహా అన్ని రాష్ట్రాల జౌళి శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయన్న అంశాలపై ప్రధాన చర్చ జరిగింది.

చేనేత కళాకారుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్‌ సమావేశంలో వివరించారు. చేనేత రంగానికి ప్రభుత్వం రూ.1,270 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. అలాగే ఈ రంగాన్ని నిరంతరం ప్రోత్సహించేందుకు హ్యాండ్లూమ్‌కు ఒక కార్పొరేషన్, పవర్‌ లూమ్‌కు ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నూలు, రసాయనాలపై నేతన్నలకు సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మగ్గాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్‌ ద్వారా యూనిక్‌ కోడ్‌ జారీ చేసి ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే నేతన్నలు తయారు చేసే గుడ్డను ప్రభుత్వమే కొనడం, చేనేతకారులు వారి ఉత్పత్తులను నేరుగా ఆన్‌లైన్‌లో అమ్ముకొనేందుకు అమెజాన్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారని, చేనేత కళాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించినట్లు కేటీఆర్‌ మీడియాకు తెలిపారు.  

హ్యాండ్లూమ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయండి
చేనేత కళాకారులకు గతంలో ఉన్నట్లు ఆరోగ్య బీమా, జీవన బీమా పథకాలను పునరుద్ధరించాలని కేటీఆర్‌ కోరారు. చేనేత రంగాన్ని మొత్తంగా జీఎస్టీలో 5 శాతం శ్లాబ్‌లో తీసుకురావాలని విన్నవించారు. తెలంగాణలో కొత్తగా మరో 14 హ్యాండ్లూమ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

ప్రతి రాష్ట్రంలో యార్న్‌ వేర్‌ హౌస్‌లు ఏర్పాటుకు కేంద్రం తరఫున సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రం నుంచి కేటీఆర్‌తోపాటు జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్, అదనపు డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు