డ్రగ్స్ కేసు: అసలు నిందితులు వేరే ఉన్నారు!

15 Jul, 2017 14:05 IST|Sakshi
డ్రగ్స్ కేసు: అసలు నిందితులు వేరే ఉన్నారు!

హైదరాబాద్‌: డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రధాన సూత్రధారి, పోలీసులు అరెస్టు చేసిన కెల్విన్‌ అమాయకుడని అతడి తండ్రి జవహర్‌ అన్నారు. కెల్విన్‌ డ్రగ్స్‌కు బానిసైన విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో అతడికి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిందితులు బయటకు వస్తారని మీడియాతో ఆయన వాపోయారు. కెల్విన్‌ను సిట్‌ అధికారులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు కెల్విన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌ కాల్‌లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు 13 మంది అరెస్ట్‌
డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు 13మందిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఏ-1గా కెల్విన్ ఉన్నారు. మిగతావారు వరుసగా అబ్దుల్ కుదుస్, అబ్దుల్ వాయిద్, ఆమెన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్, అనిరుధ్‌, సంతోష్ దీప్, మహ్మద్ జీ అలీఖాన్, బెర్లాండ్ విల్సన్, అనిష్, రీతుల్ అగర్వాల్, పీయూష్‌లు ఉన్నారు. కాగా, వీరిలో మొదటిసారి అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారించేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు చర్లపల్లి జైలు నుంచి రెండు రోజుల తమ కస్టడీకి తీసుకున్నారు.