కీలక శాఖలు సీఎం చేతికి..

26 Apr, 2016 02:13 IST|Sakshi
కీలక శాఖలు సీఎం చేతికి..

కేసీఆర్‌కు అదనంగా ఆర్‌డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల బాధ్యతలు
మంత్రుల శాఖలు మార్చుతూ ఉత్తర్వులు జారీ
కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు
జూపల్లికి పంచాయతీరాజ్ శాఖతో సర్దుబాటు
తలసానికి పశుసంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలు
పోచారం శ్రీనివాసరెడ్డికి సహకారం.. హరీశ్ శాఖల్లో కోత

 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో కీలకమైన శాఖల బాధ్యతలు నేరుగా సీఎం కేసీఆర్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఎంతో ప్రధానమైన ఆర్‌డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల శాఖలను కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతోపాటు మంత్రులు కె.తారకరామారావు, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డిల శాఖల్లో మార్పులు చేశారు. ముఖ్యమంత్రి తుది ఆమోదం మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించారు.
 
మంత్రి కె.తారకరామారావుకు మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మున్సిపల్, ఐటీ శాఖలకు తోడుగా పరిశ్రమలు-వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, గనులు-భూగర్భ వనరులు, ఎన్నారై వ్యవహారాల శాఖలను అప్పగించారు. పరిశ్రమలు-వాణిజ్య శాఖకు ఇప్పటివరకు జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖను అప్పగించి సర్దుబాటు చేశారు.
 
హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకే..
మంత్రి హరీశ్‌రావుకు మొదట కేటాయించిన శాఖల్లో మరోసారి కోత పడింది. ఇప్పటికే జరిగిన స్వల్ప మార్పుల్లో ఆయన దగ్గరున్న సహకార శాఖను తొలగించగా... ఇప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలతో తనపై పనిభారం పెరిగినందున... గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించాలని హరీశ్‌రావు స్వయంగా మూడు నెలల కింద సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
 
కొత్తగా గ్రామీణ నీటి సరఫరా శాఖ

ప్రభుత్వం కొత్తగా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ విభాగం పంచాయతీరాజ్‌లో అంతర్భాగంగా ఉండేది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో... ముఖ్యమంత్రి ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకుకీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

మరిన్ని వార్తలు