3 కంపెనీలకు ఖరీఫ్‌ పంటల బీమా

20 Mar, 2018 02:35 IST|Sakshi

సర్కారు ఆమోదానికి పంపిన వ్యవసాయశాఖ

పత్తి, వరి పంటలకు ధర పెంచిన కంపెనీలు

పత్తికి గులాబీరంగు పురుగు సోకినా బీమా లేదు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఖరీఫ్‌లో రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేసేందుకు మూడు కంపెనీలను వ్యవసాయశాఖ ఎంపిక చేసింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించగా 13 కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. వాటిలో తక్కువ కోట్‌ చేసిన జాతీయ బీమా కంపెనీ (ఎన్‌ఐసీ), వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), టాటా బీమా కంపెనీలను ఎంపిక చేసింది.

వాటి ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ కంపెనీలు ఎంతెంత కోట్‌ చేశాయన్న వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించడంలేదు. అయితే వరి, పత్తి పంటలకు సంబంధించి గతేడాదికంటే అధికంగా పంటల బీమా ప్రీమియం ధరలు పెరిగాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.  

ఎన్‌ఐసీకి మూడు క్లస్టర్లు...
రాష్ట్రంలో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఒకటో క్లస్టర్‌లో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలున్నాయి. రెండో క్లస్టర్‌లో నిర్మల్, నిజామా బాద్, కామారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలున్నాయి. మూడో క్లస్టర్‌లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలున్నాయి. నాలుగో క్లస్టర్‌లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు ఉన్నాయి.

ఐదో క్లస్టర్‌లో భద్రాద్రి, వరంగల్‌ (అర్బన్‌), వరంగల్‌ (గ్రామీణ), వనపర్తి జిల్లాలున్నాయి. ఆరో క్లస్టర్‌లో మేడ్చల్, మహ బూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల్, వికారాబాద్, మహబూబాబాద్‌ జిల్లాలున్నాయి. ఇందులో ఎన్‌ఐసీకి ఒకటి, రెండు, ఆరో క్లస్టర్లను వ్యవసాయశాఖ కేటాయించింది. ఏఐసీకి నాలుగు, ఐదో క్లస్టర్లను, టాటాకు మూడో క్లస్టర్‌ను కేటాయించింది.

ఖరీఫ్‌ ఆహారధాన్యా ల పంటలకు రైతుల నుంచి రెండు శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. అయితే జిల్లాలను, అక్కడి వాతావరణ పరిస్థితులనుబట్టి ప్రీమియం రేటు మారుతుంటుంది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి పంట నాశనమైతే మాత్రం బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం లేదు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా