తెలిసినవాడే చంపేశాడు!

19 Mar, 2016 03:10 IST|Sakshi
తెలిసినవాడే చంపేశాడు!

♦ వీడిన అభయ్ కిడ్నాప్,హత్య కేసు మిస్టరీ
♦ గతంలో పక్కింట్లో పనిచేస్తూ అభయ్‌తో స్నేహం చేసిన సాయి
♦ చనిపోయిన తర్వాత తండ్రితో బేరసారాలు.. ఆపై రెలైక్కి విజయవాడకు పరార్
♦ ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు!
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో మిస్టరీ వీడింది! అభయ్‌ని చంపింది గతంలో వారింటి సమీపంలో పని చేసిన సాయిగా తేలింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇతడు.. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు నలుగురితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దుండగుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలించాయి. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో సాయితో పాటు మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, అభయ్ వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 పని కోసం వచ్చి కన్నేసి..
 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీప ప్రాంతానికి చెందిన సాయి బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. అభయ్ కుటుంబం నివసించే ఓంకాలనీలోనే ఓ ఇంట్లో పని చేస్తూ ఇటీవలే మానేశాడు. అక్కడ పని చేస్తుండగా సమీపంలో ఉండే పిల్లలతో పరిచయం పెంచుకున్నాడు. తరచుగా అభయ్ సహా మరికొందరిని కలవడం, వారితో కలిసి క్రికెట్ ఆట డం చేసేవాడు. అభయ్ తండ్రి రాజ్‌కుమార్ పెద్ద వ్యాపారవేత్తని భావించిన సాయి.. అతడి వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాడు. ప్రస్తుతం ఏపీలో ఉంటున్న సాయి.. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఈ కిడ్నాప్ స్కెచ్ వేశాడు. విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన పరిచయస్తులు, స్నేహితులు నలుగురైదుగురితో ముఠా కట్టాడు. అభయ్‌ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడు. పది రోజుల క్రితం నగరానికి వచ్చి ఓ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ్నుంచే అభయ్ చదువుకునే ‘స్లేట్’ స్కూల్ వద్దకు వచ్చిపోతుండేవాడు. కిడ్నాప్ కుట్రకు ముందే మారుపేర్లతో నాలుగు సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఈ నంబర్‌తోనే కిడ్నాప్ తర్వాత రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.

 మాటువేసి.. కాపుగాసి..
 ఓంకాలనీలోని రాజ్‌కుమార్ ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన పలువురు కార్లను అక్కడే పార్క్ చేసుకుంటారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే అక్కడకు చేరుకున్న సాయి.. అభయ్ బయటకు వచ్చేం త వరకు ఎదురు చూశాడు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అభయ్ తన ద్విచక్ర వాహ నం (స్కూటీ)పై జ్ఞాన్‌బాగ్‌కాలనీ సీతారాంపేట్‌లో ఉండే మహాలక్ష్మీ టిఫిన్ సెంటర్‌కు వెళ్లడం గమనించి అనుసరించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత మాటలు కలిపిన సాయి... బాలుడిని ఎలాంటి అనుమానం రాకుండా తానే వాహనం నడుపుతూ దారుస్సలాం వరకు తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే వాహనంలో సిద్ధంగా ఉన్న అనుచరులతో కలిసి అభయ్‌ను కిడ్నాప్ చేశాడు.

 సాయిని గుర్తించిన కవల సోదరుడు
 కిడ్నాప్ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు సేకరించారు. ఇందులో విద్యార్థిని వెనుక ఎక్కించుకుని వెళ్తున్న వ్యక్తిని అభయ్ కవల సోదరుడు అభిషేక్‌తోపాటు ఆ ప్రాంతానికి చెందిన ఇతరులు సాయిగా గుర్తించారు. అతడు ఓంకాలనీలో పని చేయడం, ఇటీవల తరచుగా స్కూలు వద్దకు రావడం, బుధవారం మధ్యాహ్నం అభయ్ ఇంటి ఎదురుగా తచ్చాడటం తదితర అంశాలను చెప్పడంతో కేసులో చిక్కుముడి వీడింది.
 
 ముక్కుకు టేపు వేయడంతో మృతి!

 అభయ్‌ను కిడ్నాప్ చేసి వాహనంలో తరలిస్తున్న కిడ్నాపర్లు.. బాలుడి నోటికి, చేతులకు సర్జికల్ టే పు చుట్టారు. ఈ టేపు ముక్కును కూడా కప్పేయడంతో అభయ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడు చనిపోయాడని తెలుసుకున్న కిడ్నాపర్లు.. మృతదేహాన్ని పార్శిల్ చేసి సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద వదిలేసి అక్కడ్నుంచి రైల్లో విజయవాడ చేరుకున్నారని భావిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో సెల్‌ఫోన్‌ను పడేసి ఉడాయించారు. ఈ సెల్‌ఫోన్ స్థానికంగా కొందరికి దొరకడంతో అక్కడకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందాలు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. గాలింపు తర్వాత ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అభయ్ చనిపోయిన తర్వాత కూడా దుండగులు రాజ్‌కుమార్‌తో బేరసారాలు చేశారు. ఇది పోలీసుల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, నగరం దాటి వెళ్లిపోవడానికే అయి ఉంటుందని అధికారులు  అంటున్నారు.

>
మరిన్ని వార్తలు