కిల్లింగ్ ట్రైయల్స్!

21 Jun, 2017 01:11 IST|Sakshi
కిల్లింగ్ ట్రైయల్స్!

గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌(అంచనా)
2,00,000 మందిపై ఔషధ ప్రయోగం జరిగింది
20,000 ఇతరత్రా దుష్ప్రభావాలు
అవయవాలు పాడైన వారు 3,000
చనిపోయిన వారి సంఖ్య 300


ఈయన పేరు స్వామి చౌదరి. హైదరాబాద్‌లో ఉంటారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తుంటారు. దీంతో ఓ రక్తదాన కేంద్రం వారికి ఆయన పేరు నోటెడ్‌ అయింది. ఆ కేంద్రం ద్వారా కొందరు ఏజెంట్లు స్వామిని సంప్రదించారు. డబ్బులిస్తామంటూ ఔషధ ప్రయోగానికి ఒప్పించారు. అలా ఇప్పటివరకు 15 సార్లు ఔషధ ప్రయోగం చేశారు. 39 ఏళ్లున్న ఈయనకు ఒకసారి గుండెపోటు వచ్చింది. కానీ చికిత్స చేయడానికి ఔషధ ప్రయోగ కేంద్రం వారు ముందుకు రాలేదు. దీంతో స్వామి హెచ్చార్సీని ఆశ్రయించాడు.

ఆయనో జూనియర్‌ ఆర్టిస్టు. సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు వేసేవాడు. అవకాశాల్లేక పేదరికం బారిన పడ్డాడు. ఆరు నెలల కిందట కొందరు ఔషధ ప్రయోగ ఏజెంట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ చేయించుకుంటే వారానికి రూ.10 వేలు ఇస్తామని, అలా మూడుసార్లు వస్తే రూ.30 వేలు ఇస్తామని ఆయనకు ఆశ చూపారు. అందుకు సమ్మతిస్తూ మియాపూర్‌ సమీపంలోని ఓ ల్యాబ్‌లో ప్రయోగానికి వెళ్లాడు. చివరకు ఆ ఔషధం వికటించి చనిపోయాడు.
– బొల్లోజు రవి

...ఇలా ఒక్కరిద్దరు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది క్లినికల్‌ ట్రయల్స్‌ మాఫియా గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నారు. డబ్బులు వస్తాయన్న ఆశతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేహాలను అప్పగించేస్తున్నారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకొని క్లినికల్‌ ట్రయల్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలు, డబ్బు అవసరం ఉన్నవారిని టార్గెట్‌ చేసి వల విసురుతోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌ కేంద్రాలుగా ఈ అమానవీయ దందా సాగిస్తోంది. బాధితులు ప్రాణాలు కోల్పోతున్నా డోంట్‌కేర్‌ అంటోంది. ఒక అంచనా ప్రకారం గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2 లక్షల మందిపై ఔషధ ప్రయోగం జరిగితే.. అందులో సుమారు 300 మంది చనిపోయారు. మరో 3 వేల మందికి శరీరంలో వివిధ అవయవాలు పాడయ్యాయి.

ఇంకో 20 వేల మంది ఇతరత్రా దుష్ప్రభావాలకు (సైడ్‌ ఎఫెక్ట్స్‌)కు గురయ్యారు. బాధితుల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్‌ ఆర్టిస్టులు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ఏటా లక్ష మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతుండగా.. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే అధికంగా ఉంటున్నట్లు సమాచారం. ఔషధ ప్రయోగానికి ముందు 23 పేజీల అంగీకారపత్రంపై సంతకం చేయాలి. ‘‘ఈ మందు నాపై ప్రయోగించడానికి నేను ఒప్పుకుంటున్నా. దానివల్ల ఎలాంటి హాని జరిగినా, సైడ్‌ ఎఫెక్ట్‌ వచ్చినా ల్యాబ్‌కు సంబంధం లేదు. చావుకు సిద్ధమయ్యే ఇందుకు ఒప్పుకుంటున్నా..’’ అన్నది ఆ అంగీకారపత్రం సారాంశం. దీంతో మందు ప్రభావంతో బాధితుల ప్రాణం పోయినా క్లినికల్‌ ట్రయల్స్‌ కేంద్రాలపై కేసు ఉండదు.

ఏజెంట్లు.. 100 వాట్సాప్‌ గ్రూపులు
దేశంలో ప్రైవేటు ఆధ్వర్యంలో 84 ఔషధ ప్రయోగ కేంద్రాలున్నాయి. అందులో హైదరాబాద్‌లో 9, మహారాష్ట్రలో 24, గుజరాత్‌లో 17 ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉన్నా చాలా కేంద్రాలు.. సరైన మార్గదర్శకాలు పాటించకపోవడంతో పేదల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో బాధితుల వివరాలు ఉంచాలి. కానీ అలా చేయడం లేదు. రికార్డులు కూడా నిర్వహించడం లేదు. ఔషధ ప్రయోగాలకు మనుషులను తెప్పించే బాధ్యతను కొందరు ఏజెంట్లకు అప్పగించారు. వారు 100 వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తూ.. డబ్బు ఎరజూపుతున్నారు.

పేదలు, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొనే జూనియర్‌ ఆర్టిస్టులు, కార్మికులు, విద్యార్థులు, రోజువారీ కూలీలను టార్గెట్‌ చేస్తున్నారు. అలాగే బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల వద్ద ఫోన్‌ నంబర్లు తీసుకుని.. ఎక్కువ సార్లు బ్లడ్‌ ఇచ్చిన వారిని సంప్రదిస్తున్నారు. ఔషధ ప్రయోగ కేంద్రాలు కూడా మందు ప్రయోగించిన తర్వాత వారి నుంచి 350 మి.మీ. రక్తం తీసుకొని పరీక్ష చేస్తుంటాయి. ఇలా రక్తం ఇవ్వడం కూడా సేవలాంటిదేనంటూ ఆ కేంద్రాలు పలువురిని మోసపుచ్చుతున్నాయి.

మూడు దశల్లో..
పెద్దపెద్ద ఫార్మసీ కంపెనీలు తాము తయారు చేసిన ఔషధాలపై ప్రయోగం చేయాలంటూ క్లినికల్‌ ట్రయల్స్‌ కేంద్రాలకు కాంట్రాక్టు ఇస్తాయి. ఆ కేంద్రాలు మనుషులపై ప్రయోగాలు జరుపుతుంటాయి. ఒక ఔషధం మార్కెట్లో తెచ్చే ముందు మూడు దశల్లో పరీక్షిస్తారు. మొదటగా మందులో డ్రగ్‌ పరిమాణం, దాని తీవ్రత, సాంద్రతలపై పరీక్ష చేస్తారు. రెండో దశలో ఆ ఔషధాన్ని జంతువులపై ప్రయోగిస్తారు. మూడో దశలో మనుషులపై ప్రయోగిస్తారు.

మనుషులపై ఇలా..
మనుషులపై రెండు విధాల మందులను ప్రయోగించి పరీక్షిస్తారు. వాటిలో ఒకటి.. సాధారణ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించేవి. వీటివల్ల ఒక్కోసారి సైడ్‌ ఎఫెక్ట్స్‌ సహా ఏమైనా జరగొచ్చు. ఇక రెండో రకం.. అత్యంత ప్రమాదకరమైన మందులు. వాటిని ప్రయోగిస్తే బతకొచ్చు లేదా మరణించవచ్చు. ఉదాహరణకు కేన్సర్‌కు ఒక మందు కనుగొంటే దాన్ని కేన్సర్‌ రోగిపైనే ప్రయోగిస్తారు. అలాంటి సందర్భాల్లో కేన్సర్‌తో బాధపడే రోగిని టార్గెట్‌ చేసుకుంటారు. అలాగే గుండె, కిడ్నీ, కాలేయం, మెదడులకు సంబంధించిన మందులు కూడా ఉంటాయి. వీటి ప్రయోగాల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి.

ఒకే నెలలో మూడుసార్లు..
కొన్ని ఔషధ ప్రయోగ కేంద్రాలు ఒకే మనిషిపై ఒక నెలలో మూడు నాలుగుసార్లు ప్రయోగాలు చేస్తున్నాయి. మందు ఇచ్చిన ప్రతీసారి అతడి నుంచి 350 మి.మీ. రక్తం తీయాలి. ఈ లెక్కన మూడుసార్లు మందు ప్రయోగిస్తే నెలలోనే మూడుసార్లు రక్తం తీస్తున్నారు. దాంతోపాటు మూడు రకాల మందుల ప్రభావానికి గురవడంతో మరణిస్తున్నారు.

ఏం చేయాలి.. ఏం చేస్తున్నారు..?
క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. కానీ ఔషధ ప్రయోగ సంస్థలు అవేవీ పట్టించుకోవడం లేదు. క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి అంగీకారపత్రం తీసుకోవాలి. వారు ఒప్పుకుంటేనే క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాలి.
– కానీ రాష్ట్రంలో ఒక్క కేసులోనూ కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకోవడం లేదు

క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందే.. అతడిపై ఏ మందు ప్రయోగిస్తున్నారో చెప్పాలి. దాంతో జరిగే ప్రమాదాలను వివరించాలి. ఎన్నిసార్లు మందు ప్రయోగిస్తారో చెప్పాలి. ఎన్నిసార్లు రక్తం తీస్తారో తెలియజేయాలి.
– ఇవేవీ లేకుండానే బందీలుగా ఉంచి ఔషధ ప్రయోగాలు చేస్తున్నారు

ఒక వ్యక్తి ఒక క్లినికల్‌ ట్రయల్స్‌లోనే పాల్గొనాలి
– ఏజెంట్లు ఒకే వ్యక్తిపై ఒకేసారి రెండు మూడు ట్రయల్స్‌ చేయిస్తున్నారు.
క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందు సదరు వ్యక్తికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
– అవేవీ జరగడం లేదు
క్లినికల్‌ ట్రయల్స్‌కు అంగీకరించిన వ్యక్తికి తప్పనిసరిగా ఆరోగ్య బీమా చేయించాలి.
– ఎక్కడా చేయించడం లేదు
ఎథికల్‌ కమిటీ ఆమోదం తర్వాతే ట్రయల్స్‌ జరగాలి. ఈ కమిటీలో న్యాయ, వైద్య, సామాజిక ఉద్యమకర్తలు ఉండాలి. వారు అంగీకరించాకే ట్రయల్స్‌ జరపాలి.
– ఎథికల్‌ కమిటీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలున్నాయి

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట్‌ గ్రామానికి చెందిన నాగరాజు బెంగళూరులోని ఒక ల్యాబ్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌కు అంగీకరించాడు. గత నెలలో ఆయనపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేశారు. ప్రయోగానికి వెళ్లి వచ్చాక ఈ నెల 2న అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన క్లినికల్‌ ట్రయల్స్‌కు వెళ్లిన విషయం కుటుంబీకులకు తెలియలేదు. చనిపోయాక అతని వద్ద లభించిన ఆధారాలను బట్టి క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగినట్లు నిర్ధారణ అయింది.

నోట్లోంచి రక్తం.. ఫిట్స్‌..
గద్వాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. అవకాశాల్లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆయన్ను కొందరు ఏజెంట్లు కలసి డబ్బు ఆశజూపి ఔషధ ప్రయోగానికి ఒప్పించారు. ఐదారేళ్లుగా అతనిపై క్లినికల్‌ ప్రయోగాలు చేశారు. ఇప్పటివరకు ఆరుసార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ జరగడంతో ఇటీవల ఆయన నోట్లోంచి రక్తం పడింది. ఫిట్స్‌ వచ్చి కింద పడిపోయాడు.

పేదలే టార్గెట్‌
    ఔషధ ప్రయోగాలకు ఆర్థిక స్తోమత ఉన్న ఏ ఒక్కరూ ఒప్పుకోరు. డబ్బు కోసం పేదలే ఇందుకు ముందుకు వస్తున్నారు. ఇది ఎంతో బాధాకరం. అయితే వారిపై రెండు మూడుసార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ చేయడం నేరం. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వాహకులు సరైన రికార్డులు నిర్వహించడం లేదు.
– డాక్టర్‌ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌

వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి
    నాపై 15 సార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. దీంతో ఓసారి గుండెపోటు వచ్చింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వీటిపై ఉద్యమం చేస్తున్నాను. బాధితుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలి.
– స్వామి చౌదరి,క్లినికల్‌ ట్రయల్స్‌పై ఉద్యమకర్త

మరిన్ని వార్తలు