తెలంగాణలో బీజేపీది ఇక ఒంటరిపోరే!

4 Apr, 2016 03:54 IST|Sakshi
తెలంగాణలో బీజేపీది ఇక ఒంటరిపోరే!

♦ టీడీపీ పొత్తుతో ఎదగలేమన్న కమలనాథులు
♦ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామన్న దత్తాత్రేయ
♦ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సగం మంది డుమ్మా
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవసానదశకు చేరుకున్న తెలుగుదేశంపార్టీతో పొత్తు కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీకి నూకలు చెల్లినట్టేనని కమలనాథులు అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బలాన్ని ఎక్కువ ఊహించుకొని బోల్తాపడ్డామని, సైద్ధాంతికంగా బీజేపీకి అండగా నిలిచేవారు కూడా తెలుగుదేశం కారణంగా దూరమవుతున్నారని ఆ పార్టీ నాయకులు కుండ బద్దలు కొట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నగర శివార్లలోని కొంపల్లిలో జరిగింది. సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నేతలు హాజరయినప్పటికీ, సగానికిపైగా కార్యవర్గం డుమ్మా కొట్టింది.

కాగా ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు టీడీపీతో పొత్తును తెగదెంపులు చేసుకుంటేనే బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతుందని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటే  2019 ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని పలువురు పేర్కొన్నారు. ‘దేశంలో మోదీ ప్రభంజనం ఉన్నా, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దిగ జారడానికి టీడీపీతో పొత్తే కారణం’ అని పేర్కొన్నట్లు తెలిసింది.

సమావేశానికి ముందు, అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విశ్వాసాన్ని చూరగొంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని సంపాదించినట్లు అవుతుందని, ఏకపక్ష ధోరణిలో వెళితే మాత్రం అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ కరువు వైఫల్యాలు, అనేక అంశాలపై నిలదీస్తూనే ఉంటామని, రాష్ట్రంలో పైకి ఆదర్శప్రాయ వాతావరణం కనిపిస్తున్నా ప్రత్యక్షంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పోరాడతామన్నారు.

 సగానికి పైగా డుమ్మా!
 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పలువురు ముఖ్యమైన నాయకులతోపాటు సగం మంది కార్యవర్గ సభ్యులు డుమ్మా కొట్టారు. పార్టీ అంతర్గతపోరులో భాగంగా కొంతకాలంగా అంటీముట్టనట్లుగా ఉం టున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు పార్టీ ఆఫీసు బేరర్లు రామకృష్ణారెడ్డి, వెంకటరమణి, కుమార్ వంటి నాయకులు గైర్హాజరయ్యారు. సుమారు 330 మందితో గల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి 153 మంది మాత్రమే హాజరయ్యారు.  
 
 ఇక ప్రజాక్షేత్రంలో పోరుబాటే!
 తెలంగాణలో బలమైనశక్తిగా మారిన టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే పోరుబాట ఒక్కటే శరణ్యమని బీజేపీ నేతలు గుర్తించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి 24న జరిగే పంచాయతీ దివస్ వరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సామాజిక సామరస్యత పేరుతో నాలుగు రోజులపాటు అంబేడ్కర్ విగ్రహాలను శుభ్రపరచడం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, గ్రామ రైతుసభల పేరుతో 17 నుంచి 20వ తేదీ వరకు పర్యటించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు