గాలిపటమా.. పద.. పద.. పద!

6 Jan, 2018 03:41 IST|Sakshi

సంక్రాంతి సీజన్‌లో నగరంలో పతంగుల జోరు 

నాలుగు వందల ఏళ్ల నుండి బసంత్‌.. పతంగ్‌.. 

ప్రస్తుతం గాలిపటాలకు తగ్గిన ఆదరణ  

గిరాకీ లేక తయారీదారులకు ఇబ్బందులు 

సంక్రాంతి.. తెలుగు నేలపై ఒక్కోచోటా ఒక్కో తీరుగా జరిగే పండుగ.. కొత్త అల్లుళ్లు, కొంటె మరదళ్లు.. కోడిపందేలు, డూడూ బసవన్నలు.. రంగవల్లులు, పిండివంటలు.. ఇలా సంక్రాంతి సంబరం అంబరాన్ని తాకుతుంది. వీటన్నింటితో పాటు సంక్రాంతికి కొత్త శోభ తీసుకొచ్చేది పతంగులే. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్దా గాలిపటాలైపోతారు.. పతంగ్‌లు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు.. ఇక పతంగ్‌లు ఎగరేయడంలో హైదరాబాద్‌ స్టైలే వేరు.. రంగురంగుల్లో.. రకరకాల ఆకృతుల్లో గాలిపటాలు నగరంలో హల్‌చల్‌ చేస్తుంటాయి. గోల్కొండ కోటలో అయితే 400 ఏళ్ల నుంచి బసంత్‌లో పతంగులు ఎగరవేస్తుండటం గమనార్హం. అసలు పతంగుల చరిత్ర ఏమిటి? రంగుల గాలిపటాల వెనుక కార్మికుల కష్టం ఎంత? ఇప్పుడు వీటికి ఆదరణ ఎలా ఉంది..? ఈ అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..     
    – సాక్షి హైదరాబాద్‌

గాలిపటం.. గతం ఘనం.. 
400 ఏళ్ల క్రితం గోల్కొండ కోటలో కుతుబ్‌షాహీ పాలకులు బసంత్‌ నెలలో పతంగులు ఎగురవేశారు. నగరం ఏర్పాటు తర్వాత ఆసిఫ్‌జాహీ పాలనాకాలంలో గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఇక ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ పాలనలో అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా పతంగ్‌ల పోటీలు నిర్వహించి బహుమతులు సైతం అందజేసేవారు. రాను రాను ఈ పతంగ్‌ల ఉత్సవం తారస్థాయికి చేరింది. 80వ దశకం తర్వాత పతంగ్‌లకు ఆదరణ తగ్గిపోయింది. టీవీలు, వీడియోగేమ్స్, స్మార్ట్‌ మొబైల్స్‌ మొదలైన  వాటి ప్రభావంతో పెద్దవారే కాదు.. పిల్లలు సైతం.. గాలిపటాలను ఎగరవేయడం తగ్గించేశారు. దీంతో పతంగులు తయారు చేసే కుటుంబాలు వ్యాపారాలు లేక ఇక్కట్లు పడుతున్నాయి. 

తగ్గుతున్న పతంగుల తయారీ.. 
నగరంలో సరైన మైదానాలు లేక పతంగులు ఎగరవేయడానికి పిల్లలు ఆసక్తి చూపడంలేదు. గత పదేళ్లుగా వీడియోగేమ్స్, స్మార్ట్‌ఫోన్లు కూడా వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏదో పండుగ రోజు కాసేపు గాలిపటాలు ఎగరేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్న వందలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. 150 ఏళ్ల క్రితం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి పతంగులు తయారీ చేయడానికి వందలాది కుటుంబాలు వచ్చాయి. గతంలో సంక్రాంతితో పాటు వేసవి సెలవులు, ఇతర సీజన్లలోనూ పతంగుల విక్రయాలు జోరుగా ఉండేవి. నాలుగు తరాలుగా ఇదే వృత్తిలో ఉన్న వందలాది కుటుంబాలు.. పతంగులకు ఆదరణ లేక ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరుకున్నాయి. 

ధూల్‌పేట మాంజాకి గిరాకీ.. 
పతంగిని ముందు నడపాలన్నా.. గురిచూసి ప్రత్యర్థి పతంగిని పడగొట్టాలన్నా.. దాని మాంజా చాలా ముఖ్యం. మాంజాగా పిలిచే ఈ దారాన్ని ఓల్డ్‌సిటీలోనే తయారు చేస్తున్నారు. హైదరాబాదీ దూల్‌పేట మాంజాకు దేశమంతటా క్రేజ్‌ ఉంది. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించడంతో లోకల్‌ మాంజాకు ఈ ఏడాది గిరాకీ పెరిగింది. రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతోంది. దీంతో గాలిపటాల కంటే మాంజా తయారీదారుల్లో కాస్త సంతోషం కనిపిస్తోంది.

పతంగి.. ఎంతో ప్రత్యేకం.. 
పొలిటికల్‌ లీడర్‌.. సినిమా స్టార్స్‌.. కార్టూన్స్‌.. తదితర 25 రకాల ఫ్యాన్సీ పతంగుల కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక్‌ పేపర్‌తో తయారయ్యే పతంగులూ మార్కెట్‌లో ఉన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగానే వీటి రేట్లు ఉన్నాయి. రకాన్నిబట్టి రూ.300 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతున్నాయి. 

గాలిపటం ఓ జ్ఞాపకమైపోతుంది.. 
నిజాం కాలంలో సంక్రాంతికి నాలుగు నెలల ముందు నుంచే పతంగుల తయారీ మొదలయ్యేది. యావత్‌ తెలంగాణకు ఇక్కడి నుంచే సరఫరా అయ్యేది. సంక్రాంతి సీజన్‌లో రాత్రి, పగలు పనిచేసినా డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోయే వారు. తరతరాలుగా వీటినే తయారు చేస్తున్నాం. గాలిపటాలకు ఆదరణ కరువైతే భవిష్యత్‌లో ఇది కూడా ఓ జ్ఞాపకంగా మారిపోతుంది. చేనేతకు చేయూత ఇచ్చినట్లే మమ్మల్నీ ప్రభుత్వం ఆదుకోవాలి.     
    – లక్ష్మీబాయి, పతంగుల తయారీదారు 

మరిన్ని వార్తలు