గండిపేటలో పతంగులపై నిషేధం

13 Jan, 2017 21:39 IST|Sakshi

హైదరాబాద్‌: గండిపేట చెరువు పరిసరాల్లో గాలిపటాల ఎగురవేతను పోలీసులు నిషేధించారు. ప్లాస్టిక్, రసాయనిక రంగులు కలిగిన పతంగులు, మాంజా (దారం) కారణంగా గండిపేట ప్రాంతంలోని జీవవైవిధ్యం దెబ్బతింటోందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, వీటివల్ల గండిపేట చెరువు నీరు కలుషితమవుతోందని కమిషనరేట్‌ తెలిపింది. గండిపేట ప్రాంతానికి వలస వచ్చే అరుదైన పక్షులను రక్షించుకుందామని పిలుపునిచ్చింది.

పతంగులు ఎగురవేసేందుకు వచ్చేవారు అదనంగా తీసుకువచ్చే ప్లాస్టిక్ బ్యాగులలో ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, వాటర్ బ్యాగ్‌లను అక్కడే వదిలివేస్తున్నారని తెలిపింది. వీటితో పాటు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టడం, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని వివరించింది. పర్యావరణం కలుషితమవుతోందని, అందుకే గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్) పరిసర ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేత పూర్తిగా నిషేధించినట్లు కమిషనరేట్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు