నాలెడ్జ్ సెంటర్‌గా సీడీఎస్

17 Apr, 2016 01:20 IST|Sakshi
నాలెడ్జ్ సెంటర్‌గా సీడీఎస్

సాక్షి’ ఇంటర్వ్యూలో ఆ సంస్థ వ్యవస్థాపకులు మల్లేపల్లి లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: దళిత వర్గాలకు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా నిలిచి, అవసరమైన సమాచారాన్ని అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు భాగ్యరెడ్డి వర్మ స్మారక భవన్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్)ను నాలెడ్జ్ సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. అంబేడ్కర్ రచనలు, దళిత సాహిత్యం, సామాజికాంశాలు, ఇతరత్రా పుస్తకాలతో పూర్తిస్థాయిలో గ్రంథాలయం, ఆడిటోరి యం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా బోరబండలో సీడీఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో..

సీడీఎస్ లక్ష్యాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై లక్ష్మయ్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ముఖ్యాం శాలు  ఆయన మాటల్లోనే...
 సమాజంలో అణగారిన  వర్గాలకు వివిధ రూపాల్లో సహాయ పడేందుకు కార్యక్రమాలను చేపడతాం. ఇప్పటికే సీడీఎస్ ద్వారా వివిధ కార్యక్రమాలను పరిమితంగానే చేపడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న చేయూతతో దానిని పూర్తిస్థాయిలో విస్తరించి, అధికశాతం దళితులకు ప్రయోజనం కలిగించాలన్నదే మా లక్ష్యం. దళితులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఒక రీసెర్చ్, రిసోర్స్, ట్రైనింగ్‌సెంటర్‌గా సీడీఎస్‌ను నిలుపుతాం.

ఈ కేంద్రానికి వస్తే తమ సమస్యలు, సందేహాలు తీరి, ఏదో ఒక మార్గాంతరం లభిస్తుందనే నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలనేది ధ్యేయం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా యూపీఎస్‌సీ ద్వారా అందుబాటులో ఉన్న ఎన్నోరకాల ఉద్యోగాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తాం. నిరుద్యోగులు, నిరక్షరాస్యులకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి న్యాయ, వైద్య, ఆరోగ్యపరమైన సలహాలతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తాం. యువతకు నైపుణ్యాల మెరుగుదల.. శిక్షణకు వచ్చే వారికి రెసిడెన్షియల్ పద్ధతిలో సౌకర్యాలు కల్పన.. అంబేడ్కర్ జీవి తం, సాహిత్యం పై తరగతులు, ముఖ్యమైన అం శాలపై పుస్తకాల ముద్రణ, పత్రికలు తీసుకొస్తాం.  
 
పథకాలపై అవగాహన...

దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు తెలిపి, వాటి అమల్లో విధానపరమైన లోపాలు, లోటుపాట్లపై అధ్యయనం జరుపుతాం. వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతాం. దళితులకు 3ఎకరాల పంపి ణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల వల్ల కలిగే ప్రయోజనం, వాటి అమల్లోని లోపాలపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం. దళితుల జీవితాల్లోని అన్ని పార్శ్వాలను తడిమి, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు మా వంతు కృషి చేస్తాం.

మరిన్ని వార్తలు