నాపై నిఘా ఎందుకో ప్రభుత్వమే చెప్పాలి

17 Aug, 2016 04:01 IST|Sakshi
నాపై నిఘా ఎందుకో ప్రభుత్వమే చెప్పాలి

తన ఫోన్‌ను ట్యాపింగ్ వార్తలపై కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఘాటుగా స్పందించారు. తనపై నిఘా ఎందుకు పెట్టిందో, ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. మీడియా కథనాలపై తన వ్యక్తిగత మిత్రులు, శ్రేయోభిలాషులు మాట్లాడారని, ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న మాట నిజమేనని చెబుతున్నారని వెల్లడించారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని సూచించారు.

ఇలాంటి నిఘాను వ్యతిరేకించాలని, దాన్ని రూపుమాపాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్లలో తాను మాట్లాడే రహస్యాలేవీ లేవన్నారు. తెలంగాణ సాధన ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి కోసం పోరాడుతున్న క్రమంలోనూ చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నామన్నారు. తాము రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేయాలని స్పష్టంగా రాసుకున్నామన్నారు.

చట్టానికి లోబడి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలకోసం పనిచేస్తున్న జేఏసీ లాంటి సంస్థలపై నిఘా అవసరమే లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎప్పుడు కోరినా వివరాలన్నీ ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. తాము ఫోన్లలో ఏం మాట్లాడతామో బయటా అదే చెప్తామన్నారు. ట్యాపింగ్‌ల వంటివి దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను పాటిస్తే నిఘా అవసరం ఉండదన్నారు.  
 
ప్రభుత్వానికి అభద్రత
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అంతర్గత రాజకీయ వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు అభద్రతాభావంలో ఉన్నారని జేఏసీ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులపై టీఆర్‌ఎస్‌లోనే ఆందోళన ఉన్నట్టుగా కనపడుతోందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో ఇంకా ఆంధ్రా కాంట్రాక్టర్లు అన్ని రంగాల్లో పెత్తనం చేయడంపై టీఆర్‌ఎస్‌లోనే తీవ్ర అసంతృప్తి నెలకొందని, అందుకే ప్రభుత్వంలోని పెద్దలు భయపడుతున్నట్టుగా కనిపిస్తోందని జేఏసీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాసంఘాలపై నిఘాకు కారణం కావొచ్చని జేఏసీ నాయకుడొకరు చెప్పారు.
 
ఫోన్ ట్యాపింగ్ సిగ్గుచేటు: రావుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ  జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చివరకు తెలంగాణ ఉద్యమకారులపై కూడా నిఘా పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనాన్ని రుజువు చేస్తోందన్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం టీజేఏసీ పనిచేయాలని రావుల కోరారు.

మరిన్ని వార్తలు