కొద్దిపాటి భూములనూ లాక్కొంటోంది

21 Aug, 2016 01:17 IST|Sakshi

హైకోర్టులో కొల్లాపూర్ రైతుల పిటిషన్

సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైనింగ్ పేరుతో తమకున్న కొద్దిపాటి భూములను కూడా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందంటూ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వాధికారులు తమ భూముల్లో నవయుగ కంపెనీ ద్వారా సర్వే చేయిస్తూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 2013 భూ సేకరణ చట్ట నిబంధనల మేర పరిహారాన్ని ఖరారు చేయకుండా నవయుగ జోక్యం చేసుకుంటోందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన టి.నాగజ్యోతి, మరో 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 నిర్మాణం కోసం 2003లో అప్పటి ప్రభుత్వం 265 ఎకరాలను సేకరించిందన్నారు. దీంతో 114 కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయాయని తెలిపారు. ఫేజ్-2 కోసం మరో 389 ఎకరాలను సేకరించారని, దీనివల్ల 154 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయని వివరించారు.

 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైన్ అంటూ 185 ఎకరాలు సేకరిస్తున్నారని, దీనివల్ల 38 కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని  కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

మరిన్ని వార్తలు