దురుద్దేశంతోనే బహిష్కరణ

8 Apr, 2018 02:09 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌

కోర్టు ఆదేశాల మేరకు రిప్లై అఫిడవిట్‌ దాఖలు

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సభ వ్యవహరించింది

ఏజీ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు..

అంటే ఆయన ఇచ్చిన హామీ కూడా అమల్లో ఉన్నట్లే

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘ఎలాంటి చర్చ, సంప్రదింపులు లేకుండానే, మా వివరణ తీసుకోకుండానే మమ్మల్ని సభ నుంచి బహిష్కరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. శాసనసభా నిబంధనల్లో ఎక్కడా బహిష్కరణ అనేది లేదు. బహిష్కరణ చాలా కఠినమైన శిక్ష. బహిష్కరణకు గురైన సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఖాళీ అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సభా నిబంధనల్లో బహిష్కరణను చేర్చలేదు. ఏ ఆరోపణ ఆధారంగా మమ్మల్ని బహిష్కరించారో, ఆ ఆరోపణ గురించి బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదు.

మా బహిష్కరణ విషయంలో సభ లోపల చెప్పిన కారణాలు, సభ వెలుపల చెప్పిన కారణాలు, కోర్టుకు చెప్పిన కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మా బహిష్కరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది’’అని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. ‘‘అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఓ రాష్ట్రం తరఫున న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తారు. రాష్ట్రం అంటే ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా.

గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా సభలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన ఒరిజినల్‌ వీడియో ఫుటేజీలను సమర్పిస్తానని కోర్టుకు ఏజీ స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి.. ఈ హామీకి ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఏజీ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు కాబట్టి ఏజీ ఇంకా కొనసాగుతున్నట్లే. ఆయన ఇచ్చిన హామీ కూడా ఇంకా అమల్లో ఉన్నట్లే’’ అని వివరించారు. ఈ హామీకి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, దాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు.

రిప్లై అఫిడవిట్‌ దాఖలు
సభ నుంచి తమను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కూడా వారు సవాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా సభలో చోటుచేసుకున్న పరిణామాల తాలూకు వీడియో ఫుటేజీలను సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు సమాధానంగా కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ రిప్లై అఫిడవిట్‌ (తిరుగు సమాధానం) దాఖలు చేశారు.

ఏజీ ఇంకా కొనసాగుతున్నట్లే!
‘‘అడ్వొకేట్‌ జనరల్‌ను గవర్నర్‌ నియమిస్తారు. ఏజీకి రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ తరఫున హాజరయ్యే అధికారం ఉంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తరఫున, అసెంబ్లీ తరఫున ఆయన హామీ ఇవ్వొచ్చు. ఈ కేసులో మార్చి 19న కోర్టుకు హాజరైన ఏజీ.. గవర్నర్‌ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

తర్వాత అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మార్చి 27న హాజరై ఏజీ రాజీనామా చేశారని తెలిపారు. అయితే ఏజీ సిఫారసుల మేరకు హైకోర్టులో పలువురు ప్రభుత్వ సహాయ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం మార్చి 31న జీవోలు జారీ చేసింది. అంటే అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. కాబట్టి ఆయన ఇంకా ఏజీగా కొనసాగుతున్నట్లే లెక్క’’అని తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  

మా వ్యాజ్యానికి విచారణార్హత ఉంది
‘‘సభా నిర్ణయాల్లో దురుద్దేశాలు ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా, అహేతుకంగా ఉన్నప్పుడు, ఆ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. సహజ న్యాయ సూత్రాలను పాటించనప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి మా వ్యాజ్యానికి విచారణార్హత ఉంది. అందువల్ల మా నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఇచ్చిన గెజిట్‌ను రద్దు చేయండి.

రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగం సభా కార్యకలాపాల కిందకు రాదు. గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన తర్వాతే సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అసాధారణ కేసుల్లో ప్రధాన అభ్యర్థనను మధ్యంతర ఉత్తర్వుల జారీ సమయంలోనే ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో పిటిషనర్లకు తీరని నష్టం కలుగుతుందని కోర్టు భావిస్తే ఆ మేరకు తగిన నిర్ణయం తీసుకోవచ్చు.

మాకు అన్యాయం జరిగిందనేందుకు గట్టి ప్రాథమిక ఆధారాలున్నాయి. ఈ విషయంలో సత్వరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుంటే జరిగే నష్టం కూడా అపారమనేందుకు ఆధారాలున్నాయి. కాబట్టి మా బహిష్కరణను రాజ్యాంగ విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించండి’’అని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ కోరారు.

మరిన్ని వార్తలు