భూ స్కామ్‌లపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

11 Jun, 2017 02:12 IST|Sakshi
భూ స్కామ్‌లపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్‌  
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భూ స్కామ్‌లు మితిమీరి పోయాయని వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో జరిగే భూ దందాల్లో పాలక ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, పాత్రధారులని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు భూములపై వచ్చే ఆరోపణలపై విచా రణ కోరే అవకాశం లేదన్నారు. అందుకే కేంద్రం జోక్యం చేసు కొని సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.

విశాఖ భూముల కుంభకోణంలో ఏపీలో సీఎం కుమా రుడు లోకేష్, ఆయన పార్టీ వారే పాత్రధారులని తెలిపారు. తెలంగాణలోని మియాపూర్‌ భూ కుంభకోణంలో ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి పాత్ర బయటకు వచ్చిందన్నారు. కానీ ఇంతవరకు ఆయనపై ఏపీ సీఎం బాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మిగతా సమయాల్లో నీతులు వల్లె వేసే బాబు తమ పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి గురించి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అలవిగాని విషయాలపై మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలే జేసీ దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఇప్పుడేమీ మాట్లాడటం లేదేమని నిలదీశారు. హైదరాబాద్‌ నగరంలోని చాలా భూ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్‌ దగ్గరి వారి పాత్ర ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.

మరిన్ని వార్తలు