‘కాళేశ్వరానికి’ కొండ పోచమ్మ బ్రేకులు

25 May, 2017 01:50 IST|Sakshi
‘కాళేశ్వరానికి’ కొండ పోచమ్మ బ్రేకులు

సామర్థ్యం పెంచితే సమస్యలని తేల్చిచెప్పిన ఇంజనీర్లు..
- ప్రాజెక్టు డీపీఆర్‌ పూర్తయ్యాక ఇప్పుడు మార్పులు ఎలా?
కేంద్ర పర్యావరణ, జల వనరుల శాఖలకు, సీడబ్ల్యూసీ, బోర్డుకు ఏం చెబుదాం
సీఎం ఆదేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ తర్జనభర్జన


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తర్జనభర్జన మొద లైంది. విస్తృత చర్చలు, ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొలిక్కి తెచ్చిన ఈ ప్రాజెక్టులో మార్పులతో అంతా మళ్లీ మొదటికి వస్తోంది. ప్రతిపాదిత కొండ పోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లో మార్పులు అనివార్యం కాను న్నాయి. వ్యయ అంచనాలు పెరగడం, మరింత భూసేకరణ చేయాల్సి రావడం, కొత్త కాల్వల నిర్మా ణంతో ప్రాజెక్టు డీపీఆర్‌ పూర్తిగా మారిపోనుంది. దీంతో ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పొందిన అనుమతులు, సీడబ్ల్యూసీ ముందు చేసిన వాదనలు, గోదావరి బోర్డుకు సమర్పిం చిన లెక్కలన్నీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో.. దీనిపై నీటి పారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది.

మూడేళ్ల కసరత్తు వృథా..!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మూడేళ్లుగా అనేక మార్పులు, చేర్పులు జరిగిన అనంతరం ప్రాజెక్టు స్వరూపం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి లో చర్చలు, వ్యాప్కోస్‌ సర్వేలు, అధికారుల అంచనా లు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల పరిశీలన అనం తరం.. ప్రాజెక్టు కింద కొత్తగా సాగులోకి వచ్చే ఆయ కట్టు, పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ, రిజర్వాయర్ల సామర్థ్యం, ప్రాజెక్టు వ్యయం తదితరాలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందిం చింది. ప్రాజెక్టుకు మొత్తంగా రూ.80,499.71 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించి.. 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు మరో 18,82,970 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 150 టీఎంసీలు నిల్వ చేసుకునేలా 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా పాత ప్రాణహిత–చేవెళ్ల నమూనాలో ప్రతిపాదించిన 11.43 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 144 టీఎంసీలకు పెంచారు.

భారీగా భూసేకరణ
ఈ ప్రాజెక్టుకు 80 వేల ఎకరాల భూసేకరణ అవస రమని, అందులో 2,866 హెక్టార్లు (13,706 ఎకరా ల) అటవీ భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఈ వివరాలనే కేంద్ర పర్యావరణ శాఖకు, జల సంఘానికి సమర్పించింది. అయితే ఈ వివరాలపై కేంద్రం తొలుత విభేదించినా.. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్ల తో పర్యావరణ మదింపు చేసేందుకు అనుమతిచ్చిం ది. సీడబ్ల్యూసీ కూడా కొన్ని సందేహాలు లేవనెత్తినా చివరికి సానుకూలత తెలిపింది. మరోవైపు ఈ ప్రాజె క్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దాంతో కేంద్రం, బోర్డులు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కూడా కోరాయి. ప్రభుత్వం ఇంకా వివరణ చెప్పాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాలని నిర్ణయించడం నీటిపారుదల శాఖకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

భారీగా పెరగనున్న వ్యయం
కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 7 టీఎంసీల సామర్థ్యంతో రూ.519.70 కోట్లతో నిర్మించేందుకు కేబినెట్‌ అనుమతి తీసుకుని.. పరిపాలనా అనుమతులిచ్చి, డీపీఆర్‌లు కూడా సమర్పించారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యాన్ని 21 టీఎంసీలకు పెంచడమంటే మొత్తం వ్యవహారమంతా మొదటికి వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం మరో రూ.2,300 కోట్ల మేర పెరుగుతుందని, అదనంగా మరో 3 నుంచి 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ముంపు గ్రామాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పులతో కొత్తగా డీపీఆర్‌ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నాయి. ఒకవేళ కొత్త డీపీఆర్‌ చేయకుండా పాత డీపీఆర్‌తో ముందుకెళితే ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ గోదావరి బోర్డు, కేంద్రం ముందు పంచాయితీ పెట్టే అవకాశాలున్నా యని చెబుతున్నాయి. అంతేగాకుండా కొత్త డీపీఆర్‌కు మళ్లీ కేంద్ర సంస్థల అనుమతి పొందాలంటే అనేక వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని నీటి పారుదల వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలో తెలియక తర్జనభర్జన పడుతున్నాయి.

డీపీఆర్‌ కోరిన బోర్డు
ఇక మరోవైపు గోదావరి బోర్డు కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తెలంగాణ వివరణ కోరింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సమర్పించాలని సూచిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ బుధవారం లేఖ రాశారు. ఎంత ఆయకట్టు, ఎంత నీటి వినియోగం, ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలపాలని అందులో సూచించారు.

మరిన్ని వార్తలు