వైఎస్సార్‌సీపీలోకి ‘కోటగిరి’ తనయుడు

16 Jan, 2017 01:25 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలోకి ‘కోటగిరి’ తనయుడు
  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కోటగిరి శ్రీధర్‌ భేటీ
  • 29న ద్వారకా తిరుమలలో బహిరంగ సభ
  • సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ఆయన ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీలో చేరతానని శ్రీధర్‌ మీడియాకు వివరించారు.

    సీఎం కావడానికి జగన్‌ అర్హుడు
    ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ బాగా రాణిస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ అనుభవం గడించారని కోటగిరి శ్రీధర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి కావడానికి జగన్‌ అన్ని విధాలా సరైన నాయకుడని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్త వారు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు. అందువల్లే తాను వైఎస్సార్‌సీపీలో జగన్‌తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఏలూరు లోక్‌సభనియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్ల సమన్వయంతో ఇవాళ తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు.

    శ్రీధర్‌కు తాము ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామని పార్టీ సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ద్వారకా తిరుమలలో ఈ నెల 29న జరిగే సభలో ఏలూరు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ఎం.బలరాం కూడా పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఆయనను మీడియాకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేత చలమలశెట్టి సునీల్, పశ్చిమగోదావరి జిల్లా నేతలు ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావుతో తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు