పుష్కర సందోహం

15 Aug, 2016 01:34 IST|Sakshi
పుష్కర సందోహం

మూడోరోజు పోటెత్తిన భక్తజనం
* మహబూబ్‌నగర్ జిల్లాలో 13.5 లక్షల మంది, నల్లగొండలో 3.5 లక్షల మంది పుణ్యస్నానాలు
* పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ.. ఘాట్లను పరిశీలించిన డీజీపీ

సాక్షి ప్రతినిధులు,నల్లగొండ/మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల మూడోరోజు భక్తులు పోటెత్తారు. అశేష జనవాహినితో ఘాట్లు జన సంద్రమయ్యాయి. మూడ్రోజుల వరుస సెలవులతో శుక్రవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ ఆదివారం మరింత ఊపందుకుంది. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం దాదాపు 13.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.

బీచుపల్లి, అలంపూర్, సోమశిల పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే జనప్రవాహం పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. అలంపూర్‌లోని గొందిమళ్లలో దాదాపు 1.30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని దర్శించారు. బీచుపల్లిలో దాదాపు 2 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. సోమశిలలో 80 వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. అచ్చంపేటలోని పాతాళగంగలో సైతం భక్తుల సంఖ్య పెరిగింది.

గద్వాలలోని నది అగ్రహారంలో తెల్లవారుజాము నుంచే పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు బారులు తీరారు. జూరాల, పస్పుల, ఆత్మకూర్, క్యాతూర్ తదితర ప్రాంతాల్లోనూ రద్దీ కనిపించింది. డీజీపీ అనురాగ్‌శర్మ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ పుష్కరఘాట్‌ను, నల్లగొండ జిల్లాలోని వాడపల్లి ఘాట్‌ను సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులను, సామాన్య భక్తులను అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల అంచనాలకు మించి భక్తులు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక నల్లగొండ జిల్లాలో పుణ్యస్నానాలకు 3.50 లక్షల మంది తరలివచ్చారు.

నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద 1.60 లక్షలు, వాడపల్లి శివాలయం ఘాట్‌వద్ద సుమారు 70 వేల మంది, మట్టపల్లిలో 80 వేల మందికి పైగా స్నానాలు చేశారు. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో భక్తుల తాకిడి రోజువారీ మాదిరిగానే ఉంది.
 
కిలోమీటర్ల మేర ట్రాఫిక్..
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. హైవేపై రోజుకు సరాసరి 16 వేల వాహనాలు ప్రయాణిస్తుండగా.. శనివారం 4 వేలు, ఆదివారం 2 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించాయి.
 
పుష్కర ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: పుష్కరాలు జరిగే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయా జిల్లాల మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రంగాపూర్, సోమశిల, అలంపూర్, బీచ్‌పల్లి ప్రాంతాల్లో ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తారు. మంగళవారం నల్లగొండ జిల్లా వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లిలో ఆ జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి పర్యవేక్షిస్తారు. ఈ రెండు జిల్లాల పర్యవేక్షణలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు.

మరిన్ని వార్తలు