పంచాయతీ తేల్చేదెవరు..?

3 Jul, 2017 01:54 IST|Sakshi
పంచాయతీ తేల్చేదెవరు..?

- కృష్ణా జలాలపై పట్టింపు లేని కేంద్రం, బోర్డు
- నేడు హైదరాబాద్‌కు కృష్ణా బోర్డు చైర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో తెలుగు రాష్ట్రాల నీటి వినియోగ విధివిధానాల ఖరారుపై అటు కేంద్ర జల వనరుల శాఖ, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. వాటర్‌ ఇయర్‌ ఆరంభమై నెల రోజులు ముగిసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నీటి వినియోగ విధానంపై సమన్వయం చేయకుండా చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో పదేళ్ల కనిష్టానికి నీటి మట్టాలు చేరుకున్న దృష్ట్యా తెలంగాణ శ్రీశైలం నుంచి నీటి విడుదల కోరుతున్నా, పట్టిసీమ వాటా తేల్చాలంటున్నా కేంద్రం, బోర్డులు మౌనాన్నే పాటిస్తున్నాయి.

నాగార్జునసాగర్‌ కింద తాగునీటి అవసరాల నిమిత్తం తక్షణమే ఎగువ శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ గత నెలలో మూడు మార్లు కృష్ణా బోర్డుకు విన్నవించినా ఫలితం లేదు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు నీటిని పంపింగ్‌ చేసేందుకు సాగర్‌లో 502 అడుగుల నీటి మట్టాలు ఉండాలని, అయితే ప్రస్తుతం సాగర్‌లో మట్టం 501.6 అడుగులకు పడిపోయిందని తెలిపినా బోర్డు, ఈ విషయాన్ని ఏపీకి తెలియజేసి వారి అభిప్రాయం కోరడం తప్ప ఏం చేయలేకపోయింది. మూడు సార్లు ఫిర్యాదు చేయగా, దీనిపై ఏపీ తేల్చనప్పుడు తామేం చేయాలంటూ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తెచ్చింది. అయినా సమస్య మాత్రం అలాగే ఉండి పోయింది.
 
సమన్వయ సమావేశాలెప్పుడు?
ఇక ప్రతి ఏటా వాటర్‌ ఇయర్‌ జూన్‌ నుంచి మరుసటి ఏడాది జూన్‌వరకు నీటి వినియోగ ముసాయిదాను ఖరారు చేసుకోవాల్సి ఉం టుంది. ముసాయిదా ఖరారుకు సంబంధిం చి కేంద్ర జలవనరుల శాఖ ఏటా జూన్‌ లోనే ఇరు రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వివాదాలకు పరిష్కారం చూపుతూ వస్తోంది. గత ఏడాది జూన్‌ 21, 22 తేదీల్లోనే సమన్వయ సమావేశాలు పెట్టి ము సాయిదా ఖరారు చేసింది. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు దీనిపై కదలిక లేదు.

గత ఏడాది ముసాయిదానే కొనసాగించాలని తెలంగాణ, చిన్నపాటి మార్పులు చేయాలని ఏపీ బోర్డుకు ఇప్పటికే తెలియజేసినా, తమ స్పందన ఏంటన్నది బోర్డు, కేంద్రం తెలు పడం లేదు. ఇక పట్టిసీమతో గత ఏడాది ఏపీ చేసిన వినియోగం 53 టీఎంసీల్లో వాటాలపై ఎటూ తేల్చని కేంద్రం, బోర్డులు ఈ ఏడాది తిరిగి ఏపీ పట్టిసీమతో వినియోగం మొదలుపెట్టినా పట్టించుకోవడం లేదు. ఈ అన్ని అంశాలపై ముందుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలా? లేక నేరుగా కేంద్రం వద్దే సమావేశం ఏర్పాటు చేయాలా అన్న దానిపైన ఇంతవరకు స్పష్టత రాలేదు. కాగా, గత కొన్ని వారాలుగా ఢిల్లీలో ఉన్న కృష్ణా బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవ సోమవారం హైదరాబాద్‌ వస్తున్నారు. ఆయన వచ్చాక బోర్డు లేక కేంద్రం వద్ద సమావేశాలపై స్పష్టత వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు