హే కృష్ణా.. ఇది తగునా?

27 Jul, 2016 07:58 IST|Sakshi
హే కృష్ణా.. ఇది తగునా?

తెలంగాణ నీటి అవసరాలు పట్టించుకోని కృష్ణా బోర్డు
నీటిని విడుదల చేయాలని కోరినా పట్టనట్లే..
ఏపీ అవసరాలకు మాత్రం నీరివ్వాలని సూచనలు
సాగర్ నుంచి 4 టీఎంసీలు విడుదల చేయాలని స్పష్టీకరణ
మండిపడుతున్న తెలంగాణ సర్కారు
శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే
సాగర్‌కు విడుదల సాధ్యమని బోర్డుకు లేఖ
503 అడుగుల వద్ద నీటిని తోడడం కష్టమని వివరణ


హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, వివాదాల పరిష్కారంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణకు మింగుడుపడటం లేదు. రాష్ట్ర నీటి అవసరాలపై నోరు మెదపని బోర్డు.. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు మాత్రం నీటిని విడుదల చేయాలని సూచించడం పుండుపై కారం చల్లినట్లుగా ఉందని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్‌లకు నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ఏపీ అడిగిందే తడవుగా నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలనడం తమపట్ల వివక్ష చూపడమేనని భావిస్తోంది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడికాల్వకు నీటి విడుదల సాధ్యమవుతుందని తెలంగాణ తాజాగా బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బోర్డు సరైన న్యాయం చేస్తుందా? లేక ఏపీ వైపే మొగ్గు చూపుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
 
తెలంగాణ అవసరాలు పట్టని బోర్డు

ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగంపై ఈ నెల 20న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. నాగార్జునసాగర్ కుడి కాలువకు 8, తాగునీటి అవసరాలకు 4, కృష్ణా పుష్కరాలకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా 16 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం బోర్డును కోరింది. ఇదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 3, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు 4 టీఎంసీలతో పాటు నల్లగొండ తాగునీటి అవసరాలను తెలంగాణ వివరించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నీటి విడుదల చేయడం సాధ్యం కాదని సమావేశంలో స్పష్టం చేసిన బోర్డు... మూడ్రోజులకే మాట మార్చింది. ఏపీ అవసరాల నిమిత్తం 4 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణకు సూచించింది. కనీస నీటి మట్టాలకు దిగువన సాగర్ నిల్వలు పడిపోయిన అంశాన్ని కూడా విస్మరించి బోర్డు చేసిన ఈ సూచనపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌లో 503.50 అడుగులకు పడిపోయింది. ఇంతకుమించి నీటిని తోడడం సాధ్యం కాదని తెలంగాణ చెబుతోంది. అయితే 500 అడుగులకు వరకు తోడవచ్చని, అప్పటికీ సుమారు 6.07 టీఎంసీల లభ్యత ఉంటుందన్న ఏపీ వాదనకు బోర్డు వత్తాసు పలుకుతోందని తెలంగాణ భావిస్తోంది. శ్రీశైలంలోకి నీరు వస్తున్నా.. అక్కడినుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఏపీకి సూచించకుండా సాగర్ నీటిని ఏపీకి ఇవ్వాలనడం సరికాదని అంటోంది.

శ్రీశైలం నుంచి వదిలితేనే..
నాగార్జున సాగర్ కుడి కాలువకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న బోర్డు సూచనపై మంగళవారం తెలంగాణ ఘాటుగానే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తామేమీ చేయలేమని బోర్డుకు స్పష్టం చేసింది. సాగర్‌లో నీటిమట్టాలు పడిపోయిన దృష్ట్యా నీటి విడుదల అసాధ్యమని, శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే తప్ప ఏపీకి నీరు విడుదల చేయలేమని తేల్చిచెప్పింది. సాగర్ కుడి కాలువ అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నుంచి నీటి విడుదలకు ఏపీని ఒప్పించాలని బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. ఎగువ నుంచి శ్రీశైలంలోకి ఆశించిన స్థాయిలో నీరు వ స్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే సాగర్ నుంచి కుడి కాలువకు నీటిని ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వివరించింది.
 
బోర్డు ఏం చెబుతుందో..?

 తెలంగాణ వినతిపై బోర్డు ఎలా స్పందిస్తున్న దానిపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 885 అడుగులు. గరిష్టంగా 215.8 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులు. గతేడాది 790 అడుగుల వరకూ నీటిని వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నా.. 786 అడుగుల వరకూ నీటిని వినియోగించుకున్నాయి. దీంతో ఏపీ సర్కారుకు రాయలసీమ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శ్రీశైలంలో 874 అడుగుల నీటిమట్టం ఉంటేనే.. దిగువకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ రైతులు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 802.7 అడుగుల వద్ద 30.35 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడానికి ఏపీ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బోర్డు చెప్పే నిర్ణయం కీలకం కానుంది.

మరిన్ని వార్తలు