తెలుగు రాష్ట్రాలకు ఘాటు లేఖ

18 Aug, 2016 16:09 IST|Sakshi

కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న తీరుపై కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు ఆగ్రహంతో ఉంది. కృష్ణా జలాల వాడకం విషయంలో ఎవరికి వారే.. చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై గట్టిగా ప్రశ్నించాలని నిశ్చయించింది. ఈ మేరకు సమావేశ వివరాలను తెలియజేస్తూ బోర్డు ఇరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది.

 

నీటి వినియోగం విషయంలో తమకు మాటమాత్రమైన చెప్పకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఇది వరకే బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలు విస్మరించి నీటిని వాడుకోవడాన్ని తీవ్రంగా పరగణిస్తామని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, తె లంగాణ జూరాల నుంచి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడులకు తమకు తెలపకుండానే, నీటి అవసరాల ఇండెంట్ ఇవ్వకుండానే వాడుకోవడాన్ని తప్పుపట్టింది. అయితే, ప్రస్తుతం సైతం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు చెప్పకుండా, నీటిని వాడుకుంటుండటంతో త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుల వారీ నీటి పరిస్థితులు, ఇరు రాష్ట్రాల అవసరాలు, మైనర్ ఇరిగేషన్ కింద వినియోగిస్తున్న నీటిపై వివరాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, ఇప్పటికై వీటి వివరాలు సమర్పించాలని లేఖలో కోరింది. ఆ మేరకు అందిన సమాచారంతో ఈ నెల 24న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు