మరోసారి వాయిదాపడ్డ కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ

22 Jan, 2017 04:17 IST|Sakshi
మరోసారి వాయిదాపడ్డ కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ

ఈనెల 23న జరగాల్సిన సమావేశం 31కి వాయిదా
ఇప్పటికి మూడుసార్లు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాదంపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ సమావేశాలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. కృష్ణానీటి పంపకాలపై గత ఏడాది డిసెంబర్‌ 14న జరగాల్సిన సమావేశాలు తెలుగు రాష్ట్రాల వినతి నేపథ్యంలో జనవరి 23కు వాయిదా పడగా,  ప్రస్తుతం మరోమారు జనవరి 31కి వాయిదా పడ్డాయి. కాగా, ఈ తేదీలోగా కృష్ణాజలాల వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన పిటిషన్‌ విచారణకు వస్తేనే ట్రిబ్యునల్‌లో అఫిడవిట్‌ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌–89 పరిధి, విçస్తృతిపై జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ నేతృత్వంలో జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ బి.పి.దాస్‌ సభ్యులుగా గల ట్రిబ్యునల్‌ గత ఏడాది అక్టోబర్‌లో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

రెండు రాష్ట్రాలే పంచుకోవాలి...
ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్‌ తన తీర్పులో స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ (ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. సెక్షన్‌ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్‌ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్‌ 89లోని ఏ, బీ క్లాజులపై  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. అయితే ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినందున అఫిడవిట్‌ సమర్పణకు అదనపు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో గడువును జనవరి 23కి పెంచింది. అయితే ఈలోగా రాష్ట్రం వేసిన స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, దానిని కొట్టివేసింది.

అంతకుముందు ఇదే విషయమై తెలంగాణ సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు వేసిన ప్రధాన పిటిషన్‌ విచారణ యథాతథంగా జరుగుతుందని తెలిపింది. ఈ పిటిషన్‌ విచారణ సైతం ఈ నెల 18నే జరగాల్సి ఉన్నా అనివార్య కారణాలతో విచారణకు రాలేదు. దీంతో ట్రిబ్యునల్‌కు రాష్ట్రం అఫిడవిట్‌ సమర్పిం చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజాగా మళ్లీ సమావేశాలు వాయిదా పడటంతో రాష్ట్రానికి కొంత ఊరట దక్కినట్లైంది. జనవరి 31కి ముందే సుప్రీంలో ప్రధాన పిటిషన్‌విచారణకు వచ్చే అవకాశం ఉందని, అందులో సుప్రీం ఇచ్చే ఆదేశాల మేరకు అఫిడవిట్‌పై నిర్ణయం చేయాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

మరిన్ని వార్తలు