మిగులు కృష్ణార్పణమేనా?

20 Oct, 2016 03:08 IST|Sakshi
మిగులు కృష్ణార్పణమేనా?

మిగులు జలాలపై గతంలో రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చిన బచావత్ ట్రిబ్యునల్
ఎగువ రాష్ట్రాలకూ పంచిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్
కేంద్రం గెజిట్‌లో ప్రచురిస్తే దిగువ రాష్ట్రాలకు 140 టీఎంసీల మేర నష్టం
తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన 5 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

మిగులు గల్లంతు
బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల నికర జలాలు, మరో 70 టీఎంసీల రీ జనరేషన్ జలాలు ఉన్నట్టు తేల్చింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల ప్రవాహాలను పరిగణిస్తూ 65 శాతం నీటి లభ్యత లెక్కతో 2,578 టీఎంసీల జలాలు ఉన్నట్టు లెక్కలేసింది. కొత్తగా 163 టీఎంసీల నికర జలం, మరో 285 టీఎంసీల మిగులు (మొత్తం 448) జలాలు ఉన్నట్టు తేల్చింది. ఈ నీటిని మూడు రాష్ట్రాలకు(మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఏపీకి 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని కేటాయించింది.

మొత్తం 285 టీఎంసీల మిగులు జలాల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలు కేటారుుంచింది. ఈ 285 టీఎంసీల నీటిని ఆధారం చేసుకునే తెలంగాణలో 5 ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. బచావత్ తీర్పుకు విరుద్ధంగా మిగులు జలాలు పంచారని రెండు రాష్ట్రాలు ఎప్పట్నుంచో కేంద్రానికి చెబుతున్నా పట్టించుకోలేదు.

ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే ఎగువ రాష్ట్రాలు అదనంగా 254 టీఎంసీలు అంటే.. మొత్తంగా 1,573 టీఎంసీలను వాడుకుంటాయి. అదే జరిగితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి ప్రవాహం తగ్గనుంది. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ర్టంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తుంది.

ఐదు ప్రాజెక్టులపై ప్రభావం..
ట్రిబ్యునల్ తీర్పు ప్రధానంగా తెలంగాణలోని ఐదు ప్రాజెక్టులపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధార పడ్డ  ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కష్టంగా మారనుంది. ఇప్పటి వరకు మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయకపోవడంతో ఆ నీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా వీటిని చేపట్టారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను సైతం కర్ణాటక, మహారాష్ట్రకు కేటాయించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. నెట్టెంపాడు, కల్వకర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను మిగులు జలాల ఆధారంగా చేపట్టారు. వీటి ద్వారా సుమారు 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులకు ఏలాంటి కేటాయింపులు జరగలేదు. దాంతో వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.

క్యారీ ఓవర్‌పైనే ఆశలు..
ఒకవేళ  వివాదం ఏపీ, తెలంగాణలకే పరిమితమైతే.. క్యారీఓవర్ జలాలు, పోలవరం, పట్టిసీమలో వాటాలపైనే ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు నడవనున్నా యి. క్యారీ ఓవర్ అంటే నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు నిల్వ చేసుకొని తక్కువగా వచ్చినప్పుడు వినియోగించుకోవడం. బచావత్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాల 75% నీటి లభ్యత ఆధారంగా నీటిని పంపిణీ చేసింది. ఈ నీరు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు ఎక్కువ ఏడాదుల్లో అందుబాటులో ఉంటుంది. దిగువన ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఏడాదుల్లో తక్కువ గా వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ సంద ర్భాల్లో నీటి లోటును పూడ్చడానికి ఎక్కువ నీరు వచ్చినప్పుడే శ్రీశైలం, సాగర్‌లో నిల్వ చేసుకొని తర్వాత తక్కువ వచ్చినప్పుడు వినియోగించుకునేందుకు ఉమ్మడి ఏపీకి 150 టీఎంసీల క్యారీ ఓవర్ ఇచ్చింది. ఇందులో పరీవాహకం ఆధారంగా చూస్తే తమకు 100 టీఎం సీలు దక్కాలన్నది తెలంగాణ వాదన. దీనికితోడు 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరానికి అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే.

పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు తెలిపింది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది. ఇది పోలవరంలో అంతర్భాగం కానందున దీనిద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా ఈ 90 టీఎంసీలు దక్కాలని తెలంగాణ వాదించనుంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న నీటి వాటాకు క్యారీ ఓవర్ జలాలు 100 టీఎంసీలు, పోలవరం, పట్టిసీమ ద్వారా వచ్చే 90 టీఎంసీలు కలిపి మొత్తంగా నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 489 టీఎంసీలకు పెంచాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది. దీనికి తోడు రాజోలిబండ కుడి కాల్వకు కేటాయించిన 4 టీఎంసీలను రద్దు చేసి, ఆ నీటిని పంచాలని తెలంగాణ కోరే అవకాశాలుంటాయి.

అనుకున్నదే జరిగింది. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలకు కలిపి పునఃపంపిణీ చేయాలంటూ రెండేళ్లుగా చేస్తున్న పోరాటం బూడిదలో కలిసింది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ బుధవారం వెలువరించిన తీర్పు రాష్ట్రానికి అశనిపాతమైంది. ఒకవేళ కేంద్రం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పును గెజిట్‌లో ప్రచురిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోనుంది. ఆల్మట్టి ఎత్తు, మిగులు జలాల పంపిణీ వంటి అంశాలపై పోరాడే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోనుంది. మిగులు జలాలపై రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన 5 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది.     
- సాక్షి, హైదరాబాద్

మరిన్ని వార్తలు