కేటీఆర్‌ బిజీబిజీ..

21 Apr, 2017 00:26 IST|Sakshi
కేటీఆర్‌ బిజీబిజీ..

సిటీబ్యూరో:
వరుస ప్రారంభోత్సవాలు..పరిశీలనలతో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ గురువారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపారు. ఉదయం కూకట్‌పల్లి ఉషాముళ్లపూడి వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు నూతనంగా నిర్మించిన నాలా బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం కేపీహెచ్‌బీ ఫేజ్‌–4, హుడా మియాపూర్‌లో భారీ రిజర్వాయర్లను ప్రారంభించారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు.

నగర అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం నల్లగండ్ల రిజర్వాయర్‌ను ప్రారంభించి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అక్కడి నుంచి గోపన్‌పల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతరం నల్లగండ్ల, మల్కంచెరువులను సందర్శించి వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.

శభాష్‌ దానకిశోర్‌...
గ్రేటర్‌ మిషన్‌ భగీరథ తొలిఫలాలను 11 నెలల ముందుగానే  నగరవాసులకు అందించేందుకు అహర్నిశలు పనిచేసిన జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్, ఇతర బోర్డు అధికారులను మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. గ్రేటర్‌ మిషన్‌ భగీరథ పథకంలో ఇప్పటివరకు 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 1200 కి.మీ మార్గంలో పైపులైన్‌ పనులను రికార్డు సమయంలో పూర్తిచేశారని కొనియాడారు. పైప్‌లైన్‌ పనుల కోసం తవ్విన రహదారులకు సైతం వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు.

ప్రాజెక్టు పనుల వేగవంతానికి తీసుకుంటున్న చర్యలివే...
గ్రేటర్‌ శివార్లలోని 10 మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో 56 రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వీటిని ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు.

ఈ కేంద్రం నుంచి రోజువారీగా ఆయా రిజర్వాయర్ల నిర్మాణం పనుల్లో పాలుపంచుకుంటున్న కార్మికులు, రోజువారీగా జరిగిన పని గురించి నిరంతరం ఎండీ, ఇతర అధికారులు పర్యవేక్షించారు.

ఎక్కడైనా పనులు ఆగినట్లు తెలిస్తే సంబంధిత అధికారులు, పనులు చేపట్టిన ఏజెన్సీలను కారణాలు అడిగి వారిని ఉరుకులుపరుగులు పెట్టించడంతో నిర్దేశిత గడువుకంటే 11 నెలల ముందుగానే 12 భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవడం విశేషం.  

రికార్డు సమయంలో 120 రోజుల్లో 1200 కి.మీ మార్గంలో తాగునీటిపైప్‌లైన్లు ఏర్పాటుచేయడం జలమండలి చరిత్రలో ఓ రికార్డు.

పైప్‌లైన్ల ఏర్పాటుకు తవ్విన రహదారులను జూన్‌ నెలాఖరులోగా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయంతో ముందుకెళుతున్నారు. ఈపనులను పర్యవేక్షించేందుకు 30 మంది ఇంజినీర్లతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఈ ఏడాది జూన్‌ చివరినాటికి మరో 44 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు.

మరిన్ని వార్తలు