క్లీన్‌టెక్ ఆవిష్కరణలపై కేటీఆర్ అధ్యయనం

6 Jun, 2016 03:12 IST|Sakshi
క్లీన్‌టెక్ ఆవిష్కరణలపై కేటీఆర్ అధ్యయనం

- ఐ-హబ్‌లో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారీపై ఆసక్తి
- సిలికాన్ వ్యాలీలో టెస్లా ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం
- ఇలాంటి పర్యావరణహిత టెక్నాలజీలు భారత్‌కూ అవసరమని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ఆదివారం సంప్రదాయేతర ఇంధన వనరులు, నూతన ఆవిష్కరణలపై అధ్యయనం చేశారు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన క్లీన్‌టెక్ ఇంక్యుబేటర్, ఐ-హబ్‌లో నెలకొల్పిన ఇంధన వనరుల స్టార్టప్ పరిశ్రమలను పరిశీలించారు. ఔత్సాహిక పరిశోధకులతో పలు అంశాలపై చర్చించారు. ఐ-హబ్‌లో రీపర్పస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ గ్లాస్ కేటీఆర్‌ను అమితంగా ఆకర్షించింది. సాధారణ ప్లాస్టిక్ గ్లాసు పారవేశాక మట్టిలో కలిసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుంది.

అదే రీపర్పస్ సంస్థ తయారుచేసిన ప్లాస్టిక్ గ్లాసు కేవలం ఆరు నెలల్లో మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి పర్యావరణ హితమైన టెక్నాలజీ ఇప్పుడు అమెరికాలో సంచనాలు సృష్టిస్తోందని, ఇటువంటి సాంకేతికత భారతదేశానికి కూడా ఎంతో అవసరమని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి వినూత్న ఆవిష్కరణలు దోహదపడుతాయని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పలు కంపెనీల సందర్శన కోసం టెస్లా మోడల్ ఎక్స్ (ఎలక్ట్రిక్) కారులో కేటీఆర్ పర్యటించారు. దానిని కేటీఆర్ స్వయంగా నడిపి చూశారు. 2003లో ప్రారంభమైన టెస్లా కంపెనీ ఇంధన రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలు టీ-హబ్ ఔత్సాహిక పరిశోధకులకు స్పూర్తినిస్తాయని చెప్పారు.


 
 టెస్లా కారు ప్రత్యేకతలు ఇవీ..
 టెస్లా సంస్థ తాజాగా విడుదల చేసిన మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారు పక్షిలా రెక్కల ఆకారంలో తెరుచుకునే డోర్లతో విభిన్నంగా ఉంటుంది. కారు ముందు అద్దం కూడా పనోరమిక్ వ్యూ కలిగి అన్ని దిక్కులను, పైకి చూసే వెసులుబాటు ఉంటుంది. కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు చుట్టూ ఉన్న వాహనాలను, ట్రాఫిక్ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నవారికి అందిస్తుంది.

మరిన్ని వార్తలు