మహారాష్ట్రతో ఒప్పందం రాష్ట్రానికి శాపం : ఎల్.రమణ

27 Aug, 2016 01:12 IST|Sakshi
మహారాష్ట్రతో ఒప్పందం రాష్ట్రానికి శాపం : ఎల్.రమణ

సీఎం కేసీఆర్‌కు ఎల్.రమణ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న జల ఒప్పందం రాష్ట్రానికి శాపమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఈమేరకు ఆయన శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా సాధిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తాజాగా, గోదావరిపై ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందాల పేరిట చేస్తున్న హడావిడి, తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల పాలిట శాపాలుగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరించారు.

తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ 152 మీటర్లకు ఒక్క ఇంచు తగ్గినా రాష్ట్ర రైతాంగానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఉద్యమంలో పాల్గొన్న ఇంజనీర్లే చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏడు మండలాలను అంటే, సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రలోని 1,852 ఎకరాల ముంపు ప్రాంతాన్ని రాష్ట్రంలో విలీనం చేయించాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతల సాయం తీసుకుని ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని రమణ తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

>
మరిన్ని వార్తలు