అప్పీలుకు వెళ్తామనడం దారుణం

6 Aug, 2016 03:06 IST|Sakshi
అప్పీలుకు వెళ్తామనడం దారుణం

జీఓ 123పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: జీవో 123ను హైకోర్టు రద్దు చేస్తే దానిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం దారుణమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు 16సార్లు మొట్టికాయలు వేసిందని, అయినా వారికి  సిగ్గు రావడంలేదన్నారు. రమణ నేతృత్వంలో టీటీడీపీ బృందం శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యింది. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో నియంతృత్వంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు రమణ ఫిర్యాదు చేశారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013 అమలుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. ఎంసెట్-2 లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బృందంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు