ఏదీ ‘సెక్యూరిటీ’?

20 Apr, 2016 00:54 IST|Sakshi
జూ ప్రహరీపైకి వచ్చిన ఎలుగుబంటి

జూలో నిరంతర గస్తీని గాలికొదిలేసిన సిబ్బంది
కొరవడినఅధికారుల  పర్యవేక్షణ
ఎన్‌క్లోజర్‌ల నుంచి  బయటకొస్తున్న జంతువులు

 

బహదూర్‌పురా: జూ పార్కులో భద్రత డొల్లతనం బయటపడుతోంది. 24 గంటలపాటు పర్యవేక్షణ జరపాల్సిన సెక్యూరిటీ సిబ్బంది గస్తీని గాలికొదిలేస్తున్నారు. ఇక భద్రతపై అధికారుల పర్యవేక్షణా కొరవడుతోంది. సోమవారం రాత్రి ఎన్‌క్లోజర్ నుంచి ఎలుగుబంటి బయటికి వచ్చిన సంఘటనకు పూర్తిగా జూ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా చెప్పొచ్చు. చైన్ లింకును తెంపుకొని ఎలుగుబంటి చుట్టు ఉన్న ప్రహరీ గోడపైకి చేరుకోవడం కలకలం రేపింది. జూ ప్రహరీ చుట్టు హైటెన్షన్ వైర్లను ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొన్న జూ అధికారులు...ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో జూలో సాకీ (పులి)ని హత్య చేసేందుకు బౌండరీ వాల్‌ను ఆసరాగా చేసుకొని నిందితుడు లోనికి ప్రవేశించాడు. దీంతో పాటు గతేడాది కొందరు యువకులు ఇంటికి అనుకొని ఉన్న జూ గోడను దూకి..లోనికి ప్రవేశించి మొక్కలు, పండ్లను తెంచుకెళ్లిన సంఘటనలున్నాయి. ఇంత జరుగుతున్నా జూ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జూ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప ఫెన్సింగ్ గొలుసు పూర్తిగా తుప్పుపట్టి పోయింది.


జూ బౌండరీ చుట్టుగోడను ఇతర భవనాల కంటే ఎత్తుగా నిర్మించాల్సి ఉన్నా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు 24  గంటలు సెక్యూరిటీ సిబ్బంది జూ బౌండరీ చుట్టూ తిరుగుతూ గస్తీ నిర్వహించాలి. కానీ జూలో సెక్యూరిటీ మాత్రం ఆడపా దడపా పెట్రోలింగ్ నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జూలో 60 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు ఉండాల్సి ఉండగా... 45 మంది మాత్రమే ఉన్నారు. కానీ ప్రతి నెల మాత్రం 60 మంది సెక్యూరిటీల వేతనాలను జూ అధికారుల నుంచి కాంట్రాక్టర్ అందుకుంటున్నాడు. దీనిపై జూ అధికారులకు సమాచారం ఉన్నా... ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్‌పై ప్రేమను కనబరుస్తూ గత కొన్నేళ్లుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్‌ను అప్పగిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇకనైనా పీసీసీఎఫ్ అధికారులు స్పందించి జూలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపైన, జూలో భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మరిన్ని వార్తలు