ఇద్దరు చిన్నారులతో సహా హుస్సేన్‌సాగర్‌లో..

20 Jun, 2016 21:22 IST|Sakshi

రాంగోపాల్‌పేట్: భర్త వేదింపులు భరించ లేక ఇద్దరు చిన్నారులతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించిన ఓ మహిళను లేక్ పోలీసులు రక్షించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి కథనం ప్రకారం ఓల్డ్‌బోయిన్‌పల్లి దుబాయ్‌గేట్‌కు చెందిన గద్దె బాలజీ, దివ్య (29)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 8ఏళ్ల బాబు, 5ఏళ్ల పాప ఉన్నారు. బాలాజీ విలాసాలకు అలవాటుపడి ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు.

విలాసాల కోసం దివ్యకు చెందిన ఆస్తులు అమ్మేశాడు. ఇటీవల తాను వ్యాపారం చేస్తానని డబ్బు కావాలని భార్యను డిమాండ్ చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు.

మరో ఘటనలో భర్త మందలించాడనే మనోవేధనతో మరో మహిళ హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించగా పోలీసులు రక్షించారు. మెదక్ జిల్లా మందారం గ్రామానికి చెందిన ప్రియాంకను నగరానికి చెందిన సుదర్శన్‌తో 2015 సంవత్సరంలో వివాహం జరిపించారు. అప్పటి నుంచి వారి జీవితం సాఫీగా సాగుతుంది. ఆదివారం రాత్రి అత్తతో చిన్న విషయంలో గొడవ జరిగింది. దీంతో భర్త భార్యను మందలించాడు. తీవ్ర మానసిక వేధనకు గురైన ఆమె హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు