ఇన్‌స్పెక్టర్‌ శ్రీదేవి వ్యవహారంపై విచారణ..

16 May, 2017 11:57 IST|Sakshi
మహిళా సీఐ శ్రీదేవిపై బదిలీ వేటు

హైదరాబాద్‌ : లేక్‌ వ్యూ పోలీస్‌ స్టేషన్‌ మహిళా సీఐ శ్రీదేవిపై బదిలీ వేటు పడింది. ఆమెను కంట్రోల్‌ రూమ్‌కు అటాచ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ధర్నాచౌక్‌ వద్దంటూ చేపట్టిన శిబిరంలో నిన్న సీఐతో పాటు కొందరు మహిళా కానిస్టేబుళ్లు సాధారణ దుస్తులతో ఫ్లకార్డులు పట్టుకుని అందరి మధ్య కూర్చున్నారు. అయితే మీడియా ఈ విషయాన్ని గుర్తించడంతో కొంతసేపటికి వాళ్లంతా ప్లకార్డులను అక్కడ పడేసి వెళ్లిపోయారు. ఇలా ధర్నాలో కూర్చున్న మహిళా సీఐ... మధ్యాహ్నం పోలీసు యూనిఫాంలో తిరిగి ధర్నా చౌక్‌ వద్దకు వచ్చి, విధులు నిర్వర్తించారు.

దీంతో ప్రభుత్వమే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు లేక్‌ వ్యూ పీఎస్‌ నుంచి సీఐ శ్రీదేవిని బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీదేవి వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. విచారణ అనంతరం ఆమెపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ధర్నాలో పాల్గొన్న ఇతర  కానిస్టేబుళ్లను కూడా వివరణ కోరినట్లు డీసీపీ చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించినట్లు డీసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు