ఆరోగ్య పథకానికి ప్రత్యేక నిధి

18 Oct, 2016 02:23 IST|Sakshi
ఆరోగ్య పథకానికి ప్రత్యేక నిధి

ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డులపై లక్ష్మారెడ్డి సమీక్ష    
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి సంబంధించి విడిగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్యకార్డులు, ఆసుపత్రుల ప్యాకేజీ విషయమై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి విడిగా ప్రత్యేక నిధిపై ముఖ్యమంత్రితో సంప్రదించాక ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈఎస్‌ఐ, బీమా కంపెనీలు, సింగరేణి తదితర సంస్థల ఆరోగ్య పథకాలను పరిశీలించి అందులో మంచి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.

 సిద్దిపేటలో కొత్తగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలపై అధికారులకు సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి భవనాల నిర్మాణం, నిలోఫర్, బీబీనగర్ ఆసుపత్రుల ప్రగతిపై చర్చించామన్నారు. ఈ నెల 25న అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కరుణ, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం సీఈఓ పపద్మ, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు