దళిత క్రైస్తవులకూ భూపంపిణీ

21 Dec, 2014 03:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులకు (షెడ్యూల్ కులాల నుంచి క్రైస్తవులుగా మారినవారికి) భూపంపిణీ పథకంలో భాగంగా మూడు ఎకరాల పంపిణీ, భూ కొనుగోలు పథకాలు ప్రభుత్వం వర్తింపజేయనుంది. దళిత క్రైస్తవులకు చట్టబద్ధమైనహక్కులు (విద్యా,ఉద్యోగ రిజర్వేషన్లు తదితర సౌకర్యాలు) మినహా ఇతర రాయితీలను వర్తింపజేస్తూ రాష్ట్ర షెడ్యూల్‌కులాల అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్‌ఏసీ) జె.రేమండ్ పీటర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

షెడ్యూల్‌కులాల సహకార ఆర్థిక సంస్థ మంజూరు చేసే ఆర్థిక సహకార పథకాలతోపాటు, ఏయే పథకాలు షెడ్యూల్ కులాల(హిందువులు)వారికి  వర్తిస్తాయో(చట్టబద్ధ హక్కులు మినహా) అవన్నీ  ఎస్‌సీ కన్వర్డెడ్ క్రిస్టియన్లకు, బౌద్ధమతంలోకి మారిన వారికి కూడా వర్తింపజేస్తున్నట్టు ఈ జీవోలో పేర్కొన్నారు.

రాష్ట్ర క్రిస్టియన్ (మైనారిటీస్) సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార ఆర్థికసంస్థ వైస్-చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఈ జీవోలో తెలిపారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు  వంటివి షెడ్యూల్‌కులాల వారికే వర్తిస్తాయని జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ రాయితీలను పొందేందుకు దళిత క్రైస్తవులు అనర్హులని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు