మచిలీపట్నం పోర్టుకు త్వరలో భూ సమీకరణ

25 Apr, 2016 18:30 IST|Sakshi

- 12 వేల ఎకరాల సమీకరణ
- 15 మంది డిప్యూటీ కలెక్టర్లకు త్వరలో బాధ్యతలు
- మద్య నియంత్రణకు ఐదు శాఖలతో కమిటీః మంత్రి కొల్లు
 హైదరాబాద్‌

మచిలీపట్నం పోర్టుకు త్వరలో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని, నెలన్నరలోగా భూ సమీకరణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భూ సమీకరణ కార్యక్రమాల్ని పరిశీలించేందుకు మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడ) ఏర్పాటు చేశామన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి కొల్లు మీడియాతో మాట్లాడారు. పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాలను సమీకరించేందుకు 15 మంది డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నామన్నారు. మచిలీపట్నం పోర్టును అధునాతనంగా, కంటెయినర్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే డీపీఆర్‌ను పోర్ట్సు అథారిటీకి సమర్పించామని, కాంట్రాక్టు కంపెనీ నవయుగ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలియజేశారు.

రాష్ట్రంలో 1,853 గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలుగా గుర్తించామని, నవోదయం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 685 గ్రామాల్ని సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఏపీని సారా రహిత రాష్ట్రంగా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో మద్య నియంత్రణకు ఎక్సైజ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొల్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని చూసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు