భూమి @ కొత్త సాఫ్ట్‌వేర్‌!

7 Jan, 2018 02:49 IST|Sakshi

    భూరికార్డుల ఆన్‌లైన్‌ కోసం వెబ్‌ల్యాండ్‌ స్థానంలో కొత్త పోర్టల్‌ 

     వారంలో టెండర్లు,రెండు నెలల్లో అందుబాటులోకి 

     ఈ పోర్టల్‌లోని డేటా ఆధారంగానే భవిష్యత్తు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు  

సాక్షి, హైదరాబాద్‌: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం సరిచేసిన రికార్డులను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ తయారు చేస్తోంది. భవిష్యత్తులో భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పారదర్శకంగా జరిపేం దుకు వీలుగా వెబ్‌ల్యాండ్‌ స్థానంలో ఈ సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను అందుబాటులోకి తేవా లని నిర్ణయించింది. ఇందుకు సీఎం కార్యాలయ అధికారులు ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వారం రోజుల్లో పోర్టల్‌ తయారీకి సాఫ్ట్‌వేర్‌ సంస్థల నుంచి టెండర్లు పిలవాలని, 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
 
వెబ్‌ల్యాండ్‌.. ఇక పాత ముచ్చటే 
ప్రస్తుతం రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌ అనే పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ డేటా ఆధారంగానే భూముల మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ వల్ల మ్యుటేషన్‌ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్‌ స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కార్యాలయంలో సీనియర్‌ అధికారి టి.నర్సింగరావు నేతృత్వంలో ఐఏఎస్‌ అధికారులు స్మితా సబర్వాల్, వాకాటి కరుణతో పాటు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు రఘునందన్‌రావు, వెంకట్రామిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జి.రవితో సమావేశం నిర్వహించారు. అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఈ పోర్ట ల్‌ తయారీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్‌లాంటి కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. దీనినే భవిష్యత్తులో భూరికార్డుల నిర్వహణకు ఉపయోగించనున్నారు.

బ్యాంకులకు, జనబాహుళ్యానికి కూడా 
ఈ పోర్టల్‌ను రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే తహశీల్దార్‌ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు, జాతీయ బ్యాం కులకు కూడా అనుసంధానం చేయనున్నారు. పంట రుణాలిచ్చే విషయంలో బ్యాంకులకు ఈ పోర్టల్‌లోని డేటానే ఆధారమయ్యేలా తయారు చేయనున్నారు. మ్యుటేషన్‌ ప్రక్రియ నిర్ణీత గడువులో ముగిసేలా పోర్టల్‌ను రూపొందించడంతో పాటు జన బాహుళ్యానికి కూడా సులువుగా రికార్డుల వివరాలు అందుబాటులోకి వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు.

ఇప్పటికే దాదాపు భూరికార్డుల ప్రక్షాళన పూర్తి కాగా, ఈ వివరాలను ఎల్‌ఆర్‌యూపీ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇందులోని వివరాలను కొత్త పోర్టల్‌లోకి మార్చనున్నారు. ఈ పోర్టల్‌ తయారీకి కనీసం మరో 2 నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో జనవరి 26 నుంచి చేపట్టనున్న కొత్త పాస్‌ పుస్తకాల జారీకి మాత్రం ఎల్‌ఆర్‌యూపీలో నమోదైన డేటానే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయాన్ని కొత్త పోర్టల్‌లోని డేటా ఆధారంగానే అందించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు