-

‘భూ’ మంతర్‌!

11 Jan, 2018 02:28 IST|Sakshi

రికార్డుల్లో ఇష్టారాజ్యంగా భూముల నమోదు

4.7 లక్షల సర్వే నంబర్లలో 6.5 లక్షల ఎకరాలు తారుమారు..  

భూరికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల రికార్డుల ప్రక్షాళనలో వింతలు చోటుచేసుకున్నాయి. ఎక్కువ భూమి ఉన్న చోట తక్కువగా.. తక్కువ భూమి ఉన్న చోట ఎక్కువగా రికార్డుల్లో నమోదయ్యాయి. భూ రికార్డుల ప్రక్షాళన దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇలా తారుమారైన భూమి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.5 లక్షల ఎకరాలపైనే ఉందని తేలింది. దాదాపు 4.7 లక్షల సర్వే నంబర్లలో భూమి తారుమారైనట్లు ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడు ఆ తారుమారు లెక్కలను సరిచేసే పనిలో పడింది.

భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలను పరిశీలిస్తే ఒక్క వనపర్తి జిల్లాలోనే 10 శాతానికి పైగా సర్వే నంబర్లలో భూములు ఎక్కువ తక్కువగా నమోదయ్యాయని తేలింది. ఈ జిల్లాలో మొత్తం 5,67,638 సర్వే నంబర్లను పరిశీలిస్తే అందులో 53,789 సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కన్నా క్షేత్రస్థాయిలో భూమి తక్కువ ఉందని తేలింది. రికార్డుల్లో ఉన్న భూమి కన్నా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న సర్వే నంబర్లు 8,160 ఉన్నాయని తేలింది. మహబూబ్‌నగర్‌లో 45,907, జోగుళాంబ గద్వాల 38,593, నల్లగొండలో 35,696 సర్వే నంబర్లలో అత్యధికంగా భూములు తారుమారయ్యాయని తేలింది.

సర్దేది ఎలా?
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4.7 లక్షల సర్వే నంబర్లలో.. అంటే రాష్ట్రంలోని మొత్తం సర్వే నంబర్లలో 3 శాతం నంబర్లలో భూమి తారుమారయిందని నిర్ధారణ అయింది. ఇలా నిర్ధారణ అయిన వాటిలో 3.5 లక్షల సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమి క్షేత్రస్థాయిలో ఉందని, 1.2 లక్షల సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమి ఉందని రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. భూమి లేకపోయినా ఏదో ఒక రైతు పేరిట ఖాతా నంబర్‌ తెరచి ఫలానా సర్వే నంబర్‌లో ఇంత భూమి ఆ రైతుకు ఉందని దఖలు పరిచారన్నమాట.

ఒక సర్వే నంబర్‌లో 10 మంది రైతులకు భూమి ఉంటే ఇప్పుడు రికార్డుల కన్నా తగ్గిన భూమిని ఏ రైతుకు తగ్గించి సర్దుబాటు చేయాలన్నది రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. చాలా చోట్ల రైతుల అంగీకారంతో భాగాలు పంచి, గుంటల లెక్కన భూమిని తగ్గించి 1బీ ఫారంలో నమోదు చేస్తున్నామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. రికార్డుల్లో ఉన్న దాని కంటే ఎక్కువ భూమి ఉంటే మాత్రం ఆ మేరకు రైతుల పాసుపుస్తకాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపించట్లేదు. మార్పులు చేయాలంటే రికార్డుల్లో ఎక్కువ, తక్కువ నమోదయిన భూములన్నింటినీ సర్వే చేయాల్సి ఉంటుందని, సర్వే ఇప్పట్లో సాధ్యం కానందున రైతుల మౌఖిక ఒప్పందం మేరకు మార్పులు చేస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 

మరిన్ని వార్తలు