భూముల సర్వే.. వచ్చే ఏడాది

25 Aug, 2017 02:11 IST|Sakshi
భూముల సర్వే.. వచ్చే ఏడాది

వ్యవసాయ భూముల రీ సర్వేపై నిర్ణయం మార్చుకున్న సీఎం
- రికార్డుల అస్తవ్యస్త నిర్వహణ, సాంకేతిక కారణాల వల్లే...
- గ్రౌండ్‌ కంట్రోల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు మరింత సమయం
- శాటిలైట్‌ చిత్రాలు వర్షాకాలంలో సరిగా ఉండవనే అభిప్రాయం
- రికార్డుల ప్రక్షాళనపై అధికారులతో మళ్లీ భేటీ కానున్న సీఎం
- వెయ్యి మందికిపైగా ఐటీ అధికారులను నియమించే యోచన  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రీ సర్వేపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆచితూచి అడుగులేస్తున్నారు. తొలుత సెప్టెంబర్‌ నుంచే ఈ సర్వే ప్రారంభించాలని నిర్ణయించినా భూ రికార్డుల అస్తవ్యస్త నిర్వహణ, సాంకేతిక కారణాలతోపాటు సర్వే ఏర్పాట్లకు కనీసం మూడు నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో వచ్చే ఏడాదే ఈ సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఈలోగా భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, అందుకు రెవెన్యూ, వ్యవసాయ, గ్రామ రైతు చైతన్య కమిటీలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు.

ప్రక్షాళనపై మరోసారి ‘క్లాస్‌’...
భూ రికార్డుల ప్రక్షాళన, రైతు చైతన్య కమిటీల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్‌ త్వరలో మరోసారి రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులతో సమావేశం కానున్నారు. రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూశాఖకు అందించాల్సిన సహకారంతోపాటు రైతు కమిటీల ఏర్పాటులో అవలంబించాల్సిన పద్ధతులపై వ్యవసాయశాఖకు దిశానిర్దేశం చేయనున్నారు. భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నందున భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ సమస్యలు కూడా రాకూడదన్న ఆలోచనతో దాదాపు వెయ్యి మంది ఐటీ అధికారులనూ నియమించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాలతోపాటు రాష్ట్రస్థాయి రెవెన్యూ విభాగాలు, అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులను నియమించనున్నారు.

చర్చోపచర్చల తర్వాతే...  
వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనతోపాటు రీ సర్వే కూడా వచ్చే ఖరీఫ్‌కల్లా పూర్తి చేయడం ద్వారా ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌ నేతృత్వంలో మరో రెండు జిల్లాల కలెక్టర్లు, రంగారెడ్డి జిల్లా జేసీ, ముగ్గురు ఆర్డీవోలు, సర్వేశాఖ అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసభర్వాల్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌. మీనా తదితర ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై సర్వే సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇందుకోసం రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని మూడు గ్రామాల్లో నమూనా సర్వే కూడా నిర్వహించారు. ఈ చర్చల సారాంశంతోపాటు నమూనా సర్వే అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రీ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయాలని సీఎం నిర్ణయించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

సాంకేతిక ఏర్పాట్లకు సమయం వల్లే...
రెవెన్యూ ఉన్నతాధికారుల భేటీల్లో జరిగిన చర్చల ప్రకారం భూముల సర్వేకు చాలా పని ఉందని తేలింది. ముఖ్యంగా డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) పద్ధతిలో సర్వే నిర్వహించేందుకు భారీగా గ్రౌండ్‌ కంట్రోల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి చదరపు కిలోమీటర్‌కు ఓ రిఫరెన్స్‌ టవర్‌ చొప్పున తెలంగాణవ్యాప్తంగా లక్షకుపైగా టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సర్వేను వర్షాకాలంలో ప్రారంభిస్తే ఉపగ్రహ చిత్రాలు కూడా సరిగా రావనే అభిప్రాయం వ్యక్తమైంది. అక్టోబర్‌ తొలి లేదా రెండో వారం నుంచయితే ఉపగ్రహ చిత్రాల ద్వారా వచ్చే సర్వే మ్యాపులు సమగ్రంగా ఉంటాయని సాంకేతిక నిపుణులు తేల్చారు.

వీటికితోడు సర్వే ఏజెన్సీల నియామకం, ఆయా ఏజెన్సీలకు స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో జరిగిన పొరపాటు వల్లే హరియాణా, గుజరాత్‌లలో సర్వే ప్రారంభమై పదేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదని ఆయా ఏజెన్సీలతో మాట్లాడినప్పుడు అధికారులకు అర్థమైంది. మరోవైపు భూ రికార్డుల నిర్వహణ కూడా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో రికార్డుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరిగాకే రీ సర్వే చేపట్టాలని, రికార్డుల పని తర్వాత సర్వే సంగతి ఆలోచిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు