‘కోకాపేట’ కథ క్లైమాక్స్‌కు..!

20 Jul, 2015 18:15 IST|Sakshi
‘కోకాపేట’ కథ క్లైమాక్స్‌కు..!

- ‘గోల్డ్‌మైన్’భూముల టైటిల్ వివాదంపై నేడు సుప్రీంలో విచారణ
- ఎకరం రూ.14.4 కోట్లకు విక్రయంతో దేశవ్యాప్త ప్రచారం
- హోటల్ కట్టలేం..డబ్బులివ్వమంటున్న ‘టుడే హోటల్స్’
- ఈ భూములు సర్కార్‌వే.. డబ్బు ఇవ్వలేమంటున్న హెచ్‌ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో:
ఎకరం భూమి 14.4 కోట్లు పలికిన కోకాపేట ‘గోల్డ్‌మైన్’ భూముల కథ క్లైమాక్స్‌కు చేరుతోంది. తాము వేలంలో కొనుగోలు చేసిన భూమి తమకు వద్దంటూ, తాము చెల్లించిన రూ. 62.22 కోట్లు వెనక్కి ఇప్పించమంటూ టుడే హోటల్స్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు బలమైన వాదన వినిపించే దిశగా ఢిల్లీలో మకాం వేశారు. కోర్టు నిర్ణయం హెచ్‌ఎండీఏకు అనుకూలంగా వస్తే కోకాపేటలో మళ్లీ సందడి నెలకొనే ఛాన్స్ ఉండగా, వ్యతిరేకంగా వస్తే మాత్రం పద్నాలుగు సంస్థలు చెల్లించిన అసలుకు తోడు వడ్డీ కలుపుకుని సుమారు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే హెచ్‌ఎండీఏ ఆర్థి వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.
 
రిలయ్ బూంలో ‘ గోల్డ్‌మైన్’
దేశంలోనే విస్తృత ప్రచారం పొందిన కోకాపేట భూములను పదేళ్ల క్రితం  హెచ్‌ఎండీఏ ‘గోల్డ్‌మైన్’ పేరుతో వేలం వేసింది. ఇందులో అంతర్జాతీయఖ్యాతి పొందిన అనేక సంస్థలు పాల్గొని భూములు దక్కించుకున్నాయి. ఇందులో గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్-1,2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్ బూమ్ కారణంగా ఎకరం ధర రూ.5-14.25 కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా మొత్తం రూ.1755 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్కతేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు  రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. ఇందులో టుడే హోటల్స్ అనే సంస్థ  ఎకరం భూమిని రూ. 13.51 కోట్ల చొప్పున మొత్తం 4.6 ఎకరాలను కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని ఒకే వాయిదాలో చెల్లించింది. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్‌ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత  రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో  కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, వివాదాన్ని తమకు చెప్పుకుండా హెచ్‌ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి .
 
ఇదీ  వివాదం..
కోకాపేట భూములకు  హక్కుదారు నేనేనంటూ  2006 ఏప్రిల్‌లోనే కె.ఎస్.ఎ.అలీ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత  2006 జూన్‌లో ఈ భూమిని అప్పటి ‘హుడా’ ప్రస్తుత హెచ్‌ఎండీఏకు  ప్రభుత్వం అప్పగించింది. జులై 14న ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి వేలం నిర్వహించారు.  దీనిపై వాదోపవాదనల అనంతరం  కోకాపేటలోని సుమారు 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పు వెలువరించింది. సంబంధిత సంస్థలకు భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తుండగానే  దీనిపై అలీ సుప్రీంను ఆశ్రయించి ‘స్టే’ పొందారు. దీంతో హెచ్‌ఎండీఏ వేలంలో స్థలాలు కొనుగోలు చేసిన సంస్థలకు గడువులోగా భూముల బదలాయింపు నిలిచిపోయింది.
 
కోకాపేట వాసుల్లో ఉత్కంఠ
కోకాపేట భూముల వివాదం సోమవారం సుప్రీం కోర్టు ముందుకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో కోకాపేట వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. 2006 నుండి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక భూమి ధర పలికింది కోకాపేట్‌లోనే కావటం విశేషం. అప్పటి ప్రభుత్వం తలపెట్టిన విధంగా అన్నీ సవ్యంగా జరిగితే ఈ రోజు కోకాపేట పరిసరాల స్వరూపమే పూర్తిగా మారిపోయి ఉండేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పద్నాలుగు కోట్లకు పలికిన భూములు ఇటీవల కాలంలో ఎకరానికి  నాలుగు నుండి ఐదు కోట్లకు పడిపోవటంతో ఎన్నడో వ్యవసాయాన్ని వదిలేసిన వారు మళ్లీ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని వార్తలు