నల్లధనం వెల్లడికి చివరి అవకాశం

20 Dec, 2016 02:57 IST|Sakshi
నల్లధనం వెల్లడికి చివరి అవకాశం

పీఎంజీకేవై పథకంపై ఆదాయ పన్ను శాఖ స్పష్టీకరణ

- 30లోగా లెక్కల్లో చూపని నగదును బ్యాంకుల్లో జమ చేయాలి
- అందులో 50 శాతాన్ని పన్నులు, సర్‌చార్జి, జరిమానాగా చెల్లించాలి
- మరో 25% నిర్బంధ బాండ్ల రూపంలో 4 ఏళ్లు డిపాజిట్‌ చేయాలి
- మిగిలిన 25 శాతాన్ని వాడుకోవచ్చు
- ఈ అవకాశాన్ని వినియోగించుకోకుంటే తీవ్ర పరిణామాలు
- 75 శాతం నుంచి 85 శాతం ప్రభుత్వానికే..
- ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ సుశీల్‌ కుమార్‌ వెల్లడి  


సాక్షి, హైదరాబాద్‌: నల్లధనం వెల్లడికి కేంద్రం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై)’ పథకమే చివరి అవకాశమని ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్‌ విభాగం చీఫ్‌ కమిషనర్‌ సుశీల్‌కుమార్‌ స్పష్టం చేశారు. నల్లధనం ఉన్నవారు ఈ నెల 30లోగా వెల్లడిం చాలని, ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం ఆదాయపన్ను శాఖ డైరెక్టర్‌ జనరల్‌ నీనా నిగమ్, చీఫ్‌ కమిషనర్‌ ఎం.రవీంద్ర సాయిలతో కలసి హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యా లయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత స్వాధీనం చేసుకున్న నల్లధనాన్ని పేదల సంక్షేమానికి వినియోగిం చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిం దన్నారు. ఆయన చెప్పిన వివరాలు..

► ఈ పథకం కింద నల్లధనాన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో జమ చేసేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉంటుంది. నల్లధనాన్ని ప్రకటించేవారు తొలుత లెక్క చూపని నగదు లేదా డిపాజిట్‌ నుంచి 50 శాతాన్ని పన్ను, సర్‌చార్జీ, జరిమానాల కింద ప్రభుత్వానికి చెల్లించాలి.
► మరో 25 శాతాన్ని నాలుగేళ్ల నిర్బంధ కాల వ్యవధి గల పీఎంజీకేవై బాండ్ల రూపంలో బ్యాంకుల్లో జమ చేయాలి. ఈ సొమ్మును 4 ఏళ్ల తర్వాతే తిరిగి తీసుకోవడానికి వీలుంటుంది, ఈ సొమ్ముకు వడ్డీ కూడా ఉండదు. మిగతా 25శాతాన్ని దరఖాస్తు దారులు ఎప్పుడైనా వాడుకోవచ్చు.
► లెక్కల్లో చూపని ధనంపై చెల్లించిన 50 శాతం పన్ను, సర్‌చార్జి, జరిమానాల రసీదులు, మరో 25 శాతాన్ని పీఎంజీవైకే బాండ్‌ రూపంలో జమ చేసిన పత్రాలుంటేనే.. పీఎంజీకేవై కింద నల్లధనం/ఆదాయ వెల్లడికి దరఖాస్తులను స్వీకరిస్తారు.
► ఆదాయ పన్ను కమిషనర్‌ ముందు 2017 మార్చి 31వ తేదీలోపు ‘ఫార్మ్‌–1’ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛంద నల్లధన వెల్లడి కోసం గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌) కింద కొందరు వ్యక్తులు నల్ల ధనం లేకపోయినా ఉన్నట్లు బోగస్‌ దరఖా స్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈసారి తొలుత పన్నులు, జరిమా నాలు చెల్లించాకే పీఎంజీకేవై కింద దరఖాస్తులు స్వీకరిస్తోంది.
► ఈ పథకం నగదు రూపంలో ఉన్న నల్లధనానికే వర్తిస్తుంది. స్థిరాస్తులు, చరాస్తులు, బంగారంగా ఉన్న ఆస్తులకు వర్తించదు. విదేశా ల్లోని ఆదాయం, ఆస్తుల ప్రకటనకు కూడా వర్తించదు.
► ఈ పథకం కింద స్వీకరించిన దరఖాస్తులను 21 నెలల్లో పరిష్కరిస్తారు.
► పీఎంజీకేవై కింద నల్లధనాన్ని ప్రకటించిన వ్యక్తుల వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచనుంది. ఈ పథకం కింద లబ్ధిపొందిన వ్యక్తులకు నేర కార్యకలాపాల చట్టాలు మినహా ఇతర అన్ని రకాల చట్టాల కింద విచారణ నుంచి ప్రత్యేక రక్షణ (ఇమ్యూనిటీ) సైతం లభించనుంది.

నల్లధనాన్ని పట్టించేందుకు ఈ–మెయిల్‌
నల్ల కుబేరు లకు సంబంధించిన ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన సమాచారం ఎవరి వద్దనైనా ఉంటే తమకు తెలపాలని ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ సుశీల్‌కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదాయ పన్ను శాఖ మెయిల్‌ ఐడీ (blackmoneyinfo@incometax.gov.in)కు ఈ–మెయిల్‌ ద్వారా సమాచారం పంపాలని విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్తులో కఠిన చర్యలు
నల్లధనం ఉండీ పీఎంజీకేవై పథకం కింద ప్రకటించని వారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ సుశీల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అవి..
► నల్లధనం ప్రకటించని వ్యక్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నులను 2017 జూన్‌లోగా దాఖలు చేయవచ్చు. అయితే లెక్కలో చూపని నల్లధనాన్ని ఆదాయ పన్ను రిటర్న్‌లో చూపితే అందులో 60 శాతం పన్ను, 15 శాతం సర్‌చార్జి కలిపి మొత్తం 75 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
► ఒకవేళ లెక్కలో చూపని ఆదాయాన్ని ఆదాయ పన్ను విభాగమే గుర్తిస్తే.. పైన పేర్కొన్న 75 శాతానికి మరో 10 శాతం జరిమానా కలిపి మొత్తం 85 శాతం వసూలు చేస్తారు. దీంతోపాటు 7 ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది.

వీరికి ఈ పథకం వర్తించదు..
చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా నల్లధనాన్ని సంపాదించిన వ్యక్తులకు పీఎంజీకేవై వర్తించదు. నేర కార్య కలాపాలైన స్మగ్లింగ్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, బినామీ లావాదేవీలు, మనీలాండరింగ్, 1992 సెక్యురిటీ స్కాం, ఐపీసీలోని 9వ అధ్యాయం ప్రకారం శిక్షార్హమైన నేరాలు(ప్రభుత్వ ఉద్యోగులు చట్ట వ్యతిరేకంగా వ్యాపారం చేయుట, చట్ట వ్యతిరేకంగా కొనుగోళ్లు, చట్ట వ్యతిరేకంగా వేలంలో పాల్గొనుట వంటి వి), ఐపీసీ అధ్యాయం 17 ప్రకారం శిక్షార్హమైన నేరాలైన దొంగతనం, దోపిడీ లు, బెదిరించి వసూళ్లు, హత్యల ద్వారా సంపాదించిన ఆస్తులను ఈ పథకం కింద ప్రకటించడానికి వీలులేదు.

మరిన్ని వార్తలు