ఉసురు తీస్తున్న నిర్లక్ష్యం

5 Oct, 2013 04:16 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం.. బహిరంగ ప్రదేశాల్లో తవ్వి వదిలేసిన గుంతలు, మూతల్లేని సంపులు, మ్యాన్‌హోళ్లు, పైకప్పులేని నాలాలు.. ఇవన్నీ ప్రాణాంతకంగా మారుతున్నాయి. క్షణాల్లో విలువైన ప్రాణాల్ని హరిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని యంత్రాంగం, అటువంటి చోట్లకు వెళ్లకుండా చూడటంలో ఒక్కోసారి పెద్దలు చూపే ఆదమరుపు పిల్లల్ని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి. ఈ తరహా దుర్ఘటనలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. గుంతల్లో మునిగి, సంపుల్లో పడి చనిపోతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం.

శుక్రవారం నాచారంలో ఓ భవన నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన గుంతలో ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కూడా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ గుంతలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేవు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులు ఇక్కడకు ఈత కొట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణ యాజమాన్యం గుంత చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేపట్టి ఉంటే ఈ దుర్ఘటన చోటుచేసుకునేది కాదని స్థానికులు అంటున్నారు. రోజూ మాదిరిగానే పిల్లలు స్కూలు నుంచి ఇంటికి చేరుకుంటారని తల్లిదండ్రులు భావించారు. కానీ అనుకోని రూపంలో విషాదం వారి కుటుంబాలను కకావికలం చేసింది.
 
అవగాహన లేక కొంత..

 పొరుగు జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండట్లేదు. భవన నిర్మాణాల కోసం తవ్వి వదిలేస్తున్న గుంతలు, మూతల్లేని సంపులు వంటి వాటి గురించి వీరికి పెద్దగా తెలియట్లేదు. పైగా, కుటుంబపోషణ నిమిత్తం కూలీ పనులకు వెళ్లిపోతున్నారు. దీంతో పిల్లలపై నిఘా, పర్యవేక్షణ కరువవుతున్నాయి. ఇక, పిల్లల ఆలనాపాలనా ఇంటి పట్టున ఉండి చూసుకునే పెద్దదిక్కు కరువవుతోంది. ఇదే వారి కుటుంబాల పాలిట శాపమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లోని సంపులు, నీటి గుంతలు ఉన్న చోట్ల రక్షణ ఏర్పాట్లు మర్చిపోతున్నారు. ఇక ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీ అపశృతులకు కారణమవుతున్నాయి.  

 చిన్నారులకు కుతూహలం మరికొంత..

 పరిపక్వత లేని పసి మనసులు. అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూసే కళ్లు. ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలం. పెద్దలు ఏ పనులు చేయొద్దని వారిస్తారో అదే చేయడానికి పిల్లలు ఉత్సుకత చూపిస్తారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరికి ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచు వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. పెద్దలు ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా ఆటలు, సరదా పేరుతో ఈత కొలనులు, గుంతలు వద్దకు చేరుకుంటున్నారు. ఆ సరదానే ప్రాణాల మీదికి తెస్తోంది.
 

మరిన్ని వార్తలు