లెక్చరర్ పోస్టుల భర్తీకి టీసర్కార్ గ్రీన్ సిగ్నల్

1 Jun, 2016 20:43 IST|Sakshi

హైదరాబాద్: ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం జీవో 72 జారీ చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజీలు అయిన కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(సీటీఈ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ), డీఎడ్ కాలేజీలు అయిన జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ పోస్టుల భర్తీ బాధ్యతలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్  (టీఎస్‌పీఎస్సీ)కు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్, జిల్లా విధానం వర్తిస్తుందని, రోస్టర్ కమ్ రిజర్వేషన్ల ప్రకారం వీటిని భర్తీ చేయాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను పాఠశాల విద్యాశాఖ టీఎస్‌పీఎస్సీకి అందజేయాలని వివరించారు.

సర్వీసు రూల్స్ సమస్య తేలితేనే మరో 70 శాతం పోస్టులు!
30 శాతం డెరైక్టు రిక్రూట్‌మెంట్ కోటా పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా పదోన్నతులపై భర్తీ చేయాల్సిన మరో 70 శాతం పోస్టుల భర్తీ తేలాల్సి ఉంది. సర్వీసు రూల్స్ సమస్య కారణంగా గత 15 ఏళ్లుగా పదోన్నతులపై భర్తీ పోస్టుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈ లెక్చరర్ పోస్టులకు తామే అర్హులమని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటుండగా, ఎక్కువ సంఖ్యలో ఉన్న తమకు ఆ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ టీచర్లు పట్టుపడుతున్నారు. దీంతో ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఎటూ తేలలేదు.

మరిన్ని వార్తలు