ఇంటింటికీ ఎల్‌ఈడీ వెలుగులు

24 Feb, 2016 00:13 IST|Sakshi
ఇంటింటికీ ఎల్‌ఈడీ వెలుగులు

♦ రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎఫీషియంట్ లైటింగ్ ప్రోగ్రాం అమలు
♦ పైలట్ ప్రాజెక్టు కింద మెదక్,నిజామాబాద్ జిల్లాలు ఎంపిక
 
 సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ విద్యుత్ బల్బులకు బదులు ఎల్‌ఈడీ బల్పుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎఫీషియంట్ లైటింగ్ ప్రోగ్రాం (డీఈఎల్పీ)ను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సంప్రదాయ విద్యుత్ బల్బులతో పోలిస్తే ఎల్‌ఈడీ బల్బుల వినియోగం వల్ల 80 శాతం విద్యుత్ పొదుపు అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి 9 వాట్ల సామర్థ్యం గల రెండు ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేస్తామన్నారు.

మంగళవారం జరిగిన రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సంస్థ (టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గృహాల్లో విద్యుత్ పొదుపు చర్యల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన భద్రత సాధించవచ్చని అరవింద్ కుమార్ అన్నారు. విద్యుత్ డిమాండు పతాక స్థాయికి చేరినపుడు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేసేందుకు ఇంధన పొదుపు చర్యలు దోహదపడతాయన్నారు. సమావేశంలో ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ పండా దాస్, సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.శ్రీనివాస్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు