స్తంభించిన న్యాయవ్యవస్థ

3 Jul, 2016 03:15 IST|Sakshi
స్తంభించిన న్యాయవ్యవస్థ

- రెండో రోజుకు చేరిన ఉద్యోగుల సమ్మె
ఎక్కడి కేసులు అక్కడే
డిమాండ్లు సాధించుకునే దాకా సమ్మె: ఉద్యోగ సంఘం
 
 సాక్షి, హైదరాబాద్:
ప్రత్యేక హైకోర్టుతోపాటు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులు రద్దు చేయాలంటూ తెలంగాణవ్యాప్తంగా న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండోరోజుకు చేరింది. ఉదయం 10 గంటలకు కోర్టులకు చేరుకుంటున్న ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. న్యాయాధికారులే స్వయం గా తాళాలు తీసుకొని చాంబర్లలో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మెకు వెళ్తున్నం దున ఏడు రోజులకు సంబంధించిన రోజువా రీ కేసుల జాబితాను ఉద్యోగులు ఇప్పటికే న్యాయాధికారులకు అందజేశారు. కనీసం కేసు రికార్డులను కూడా న్యాయాధికారుల ముందుంచే పరిస్థితి లేదు. దీంతో ఒక్క కేసూ విచారించే పరిస్థితి లేకుండా పోయింది.

న్యాయ శాఖ ఉద్యోగులకు మద్దతుగా సోమవారం నుంచి న్యాయవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఫలితంగా సమ్మె మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. డిమాండ్లు సాధించుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేతలు లక్ష్మారెడ్డి, జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. హైకోర్టుకు ముందే సమ్మె నోటీసు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. హైకోర్టు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసిందన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.

 9 వరకు విధుల బహిష్కరణ
 న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు లు రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ విధుల బహిష్కరణ కొనసాగుతుందని న్యాయవాద సంఘాలు స్పష్టం చేశాయి. 4 నుంచి 9 వరకు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తెలిపారు. 4న అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన, 5న సర్వమత ప్రార్థనలు, 7న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, జైల్‌భరో, 8న ఉద్యమానికి మద్దతుగా ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడతామన్నారు. 9న సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు