లియో ప్రమోటర్లకు ఎదురుదెబ్బ

14 Sep, 2017 03:30 IST|Sakshi
లియో ప్రమోటర్లకు ఎదురుదెబ్బ
- సీబీఐ కేసుల కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
పిటిషనర్లు తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారు
ఇలాంటి వారిని వదిలేస్తే నష్టపోయేది ప్రజలే
పిటిషన్లు కొట్టేస్తూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు
 
సాక్షి, హైదరాబాద్‌: హోటల్‌ నిర్మాణం నిమిత్తం మూడు జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి కోట్లలో రుణం తీసుకుని మోసగించిన ఉదంతంలో లియో మెరీడియన్‌ ప్రాజెక్ట్స్‌ యాజమాన్యానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయమై తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ లియో ప్రమోటర్లు జీఎస్‌ చక్రవర్తి రాజు, గోకరాజు స్వర్ణకుమారి, టి.వి.నరసింహం, డి.రామచంద్రరాజు తదితరులు వేర్వేరుగా దాఖలు చేసిన ఆరు వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది.

బ్యాంకుల నుంచి కోట్లలో రుణం పొందిన పిటిషనర్లు హోటల్‌ నిర్మాణం పూర్తి చేయకుండా నిధులను పక్కదారి పట్టించారని తేల్చిచెప్పింది. ‘‘ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశాలతోనే పిటిషనర్లు ఇలా చేశారు. తద్వారా తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎగవేసిన డబ్బు బ్యాంకులది కాదు. ప్రజలది. ఇలాంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయడమే గాక జాతి ఆర్థిక వెన్నెముకనే విరిచేస్తాయి. ఆర్థిక వ్యవస్థనే గాక ప్రజలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని స్వేచ్ఛగా వదిలేస్తే, అంతిమంగా నష్టపోయేది ప్రజలే’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వారిపై సీబీఐ కేసులను కొట్టేయడం సాధ్యం కాదంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. రంగారెడ్డి జిల్లా, బొమ్మరాస్‌పేటలో హోటల్‌ నిర్మాణం నిమిత్తం లియో మెరీడియన్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నేతృత్వంలోని కన్సార్షియం రూ.432.22 కోట్ల రుణం మంజూరు చేసింది. కొంతకాలం తర్వాత ప్రమోటర్లు హోటల్‌ నిర్మాణాన్ని ఆపేశారు. రుణ చెల్లింపులు కూడా చేయలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దీనిపై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసింది.

తనఖా భూమిని ప్లాట్లు చేసి లియో ప్రమోటర్లు ఎప్పుడో అమ్మేశారని దర్యాప్తులో తేలింది. దాంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదు మేరకు 2015లో సీబీఐ కేసు నమోదు చేసింది. కన్సార్షియంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ కూడా 2017 ఫిబ్రవరిలో సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తమపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ చక్రవర్తి రాజు, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్లంతా బంధువు లేనని, కూడబలుక్కొనే ఆర్థిక నేరానికి పాల్పడ్డారని ఆయన తేల్చారు.
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా